ఇండోర్: ఇటీవల టీమిండియా సాధిస్తున్న విజయాల్లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్యాటింగ్ లో పించ్ హిట్టర్ పాత్రను కొన్ని సందర్బాల్లో హార్దిక్ తన భుజాలపై వేసుకుంటున్నాడు. ప్రత్యర్థి బౌలర్ పై ఎదురుదాడే చేసే క్రమంలో హార్దిక్ అద్భుతమైన సిక్సర్లతో అలరిస్తున్నాడు. ఆసీస్ తో మూడు వన్డేలో ఐదు ఫోర్లను కొట్టిన హార్దిక్.. నాలుగు సిక్సర్లను బాది మరోసారి 'సిక్సర పిడుగు'అనిపించుకున్నాడు. అయితే సిక్సర్లను అంత సులువు కొట్టడంపై ఒక సగటు అభిమాని తలెత్తిన ప్రశ్నకు హార్దిక్ తాజాగా సమాధానిమిచ్చాడు.
'నాకు సిక్సర్లను హిట్ చేయడం చిన్నతనం నుంచే అలవాటు. నా బాల్యంలో క్రికెట్ ఆడేటప్పుడు ఎక్కువగా సిక్సర్లను కొట్టేవాణ్ని. నేను రాత్రికి రాత్రే సిక్సర్లు కొట్టే స్కిల్ ను నేర్చుకోలేదు. అది నాతో పాటు అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఫలితంగా సులువుగా సిక్సర్లను కొడుతున్నా. ఈ మ్యాచ్ లోనే కాదు.. గత మ్యాచ్ ల్లో కూడా సిక్సర్లను కొట్టా. భారీ ఎత్తులో సిక్సర్ల కొట్టడం నాకు అలవాటు'అని హార్దిక్ తెలిపాడు.
అయితే చాంపియన్స్ ట్రోఫీకి తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అనే దానిపై పాండ్యా తనదైన శైలిలో జవాబిచ్చాడు. ఇక్కడ ఎవరు ఎలా అనుకున్నా తనకు వచ్చిన నష్టమేమీ లేదన్నాడు. గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో తాను రాణించిన విషయాన్ని పాండ్యా ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అయితే గత ఐపీఎల్ మాత్రం తనకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.