బెంగళూరు: టీమిండియా యువ సంచలనం హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా మారిన హార్దిక్ ఓ సిక్సర్ల రికార్డును సాధించాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్ హార్దిక్ తొలి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డును బద్ధలు కొట్టాడు. ఇప్పటివరకూ 2017లో హార్దిక్ 28 సిక్సర్లు సాధించి అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇక్కడ ఇయాన్ మోర్గాన్(26) రెండో స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ(24) మూడో స్థానంలో ఉన్నారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(18) నాల్గో స్థానంలో నిలిచాడు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నాల్గో వన్డేకు ముందు హార్దిక్ పాండ్యా 25 సిక్సర్లతో ఉన్నాడు. అంటే మోర్గాన్ కంటే ఒక సిక్సర్ వెనుకబడి ఉన్నాడు. కాగా, ఆ మ్యాచ్ లో పాండ్యా మూడు సిక్సర్లు సాధించడంతో టాప్ ప్లేస్ ను ఆక్రమించాడు. ఇదిలా ఉంచితే, వన్డేల్లో ఆస్ట్రేలియాపై 50కి పైగా సిక్సర్లు కొట్టిన ఘనతను రోహిత్ శర్మ సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ పై వన్డేల్లో 50 సిక్సర్లు కొట్టిన ఒకే ఒక్క ఆటగాడు రోహిత్ శర్మ. ఆ తరువాత రెండో స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(39 వన్డే సిక్సర్లు) ఉన్నాడు. నాల్గో వన్డేలో భారత జట్టు 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.