హెచ్‌సీఏ సిబ్బంది అభ్యర్థన
సాక్షి, హైదరాబాద్: తమకు బకాయి పడిన జీతాలను ఇవ్వాలంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సిబ్బంది తమ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ శనివారం తమ సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని హెచ్‌సీఏ అధ్యక్షులు, కార్యదర్శులకు సమర్పిం చారు. జనవరి, ఫిబ్రవరి మాసాలకు చెందిన 45 రోజుల జీతాన్ని తమకు ఇంకా చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు. జీతాలతో పాటు తమకు రావాల్సిన ప్రోత్సాహకాలను ఇవ్వాలని కోరారు.
2016లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఇన్సెంటివ్స్‌తో పాటు, బెస్ట్ గ్రౌండ్ రివార్డు, ఇండియా–బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ బోనస్‌తో పాటు అదనపు సమయం పనిచేసినందుకు తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా హెచ్‌సీఏ సరైన సమయానికి నిధులను విడుదల చేయకపోవడంతో తాము తీవ్రంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సిబ్బంది తెలిపారు.