రహానే శతకం
♦ కోహ్లి, ధావన్ అర్ధ సెంచరీలు
♦ భారత్ 310/5
♦ విండీస్‌తో రెండో వన్డే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ పర్యటనలో ఓపెనర్ అజింక్యా రహానే చెలరేగుతున్నాడు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న అతను ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో శతకం (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు. అతడికి తోడు కెప్టెన్ కోహ్లి (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు.
ఓపెనర్లు మెరిశారు: వరుసగా రెండో వన్డేలోనూ ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రహానే, ధావన్ మరోసారి దుమ్ము రేపే ఆరంభాన్ని అందించారు. ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగిన ఈ జోడి ఓవర్‌కు ఆరు పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. మూడో ఓవర్‌లోనే రహానే సిక్స్ బాదగా ఆ తర్వాత ఓవర్‌లో ధావన్ వరుసగా రెండు ఫోర్లతో పాటు... హోల్డర్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో మూడు ఫోర్లతో మెరిశాడు.
12వ ఓవర్‌లోనూ మూడు ఫోర్లతో చెలరేగిన ధావన్ 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే స్పిన్నర్ నర్స్ బౌలింగ్‌లో కవర్స్ వైపు డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన ధావన్ క్రీజు వదిలి ముందుకు వచ్చి స్టంప్ అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వీరిద్దరి మధ్య వరుసగా ఆరోసారి 50 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొనడం విశేషం. ఆ వెంటనే రహానేతో జత కట్టిన కెప్టెన్ కోహ్లి కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు.
ఏమాత్రం ప్రభావం చూపని విండీస్ బౌలింగ్‌ను ఈ జోడి కూడా సులువుగానే ఎదుర్కొంది. రహానే 102 బంతుల్లో బౌండరీ ద్వారా విండీస్‌పై తొలి, కెరీర్‌లో మూడో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే మరో రెండు పరుగుల అనంతరం రహానేను కమిన్స్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పాండ్యా (4), యువరాజ్ (14) వికెట్లు కూడా త్వరగానే పడినా అటు కోహ్లి బాదుడు మాత్రం ఆగలేదు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రహానే (బి) కమిన్స్ 103; ధావన్ (స్టంప్డ్) హోప్ (బి) నర్స్ 63; కోహ్లి (సి) నర్స్ (బి) జోసెఫ్ 87; హార్దిక్ పాండ్యా (సి) కమిన్స్ (బి) జోసెఫ్ 4; యువరాజ్ (సి) హోప్ (బి) హోల్డర్ 14; ధోని నాటౌట్ 13; జాదవ్ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (43 ఓవర్లలో 5 వికెట్లకు) 310. వికెట్ల పతనం: 1–114, 2–211, 3–223, 4–254, 5–285. బౌలింగ్: జోసెఫ్ 8–0–73–2; హోల్డర్ 8.5–0–76–1; నర్స్ 9–0–38–1; బిషూ 9–0–60–0; కమిన్స్ 8–0–57–1; కార్టర్ 0.1–0–2–0.