ప్రజలు ముఖ్యమా? ఐపీఎల్ ముఖ్యమా?
► మ్యాచ్‌లను తరలించండి
► బీసీసీఐకి ముంబై హైకోర్టు సూచన
ముంబై: మహారాష్ట్రలో తీవ్ర కరువు, నీటి ఎద్దడి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఆడాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే చోటుకు తరలించాలని బాంబే హైకోర్టు... బీసీసీఐకి సూచించింది. నీటి సంక్షోభం లేని చోట మ్యాచ్‌లను నిర్వహిస్తే బాగుంటుందని వెల్లడించింది. పిచ్‌ల నిర్వహణ కోసం భారీగా నీటిని వినియోగిస్తున్నారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ‘బీసీసీఐ, క్రికెట్ సంఘాలు ఇలా నీటిని వృథా చేస్తుంటే ఏం చేస్తున్నారు. ప్రజలు ముఖ్యమా? ఐపీఎల్ మ్యాచ్‌లు ముఖ్యమా? ఈ విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నీటిని వృథా చేయడం నేరపూరితమైన చర్య.
మహారాష్ట్రలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నారుగా’ అంటూ జస్టిస్ వీఎం కనడి, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఘాటుగా వ్యాఖ్యానించింది. క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో తాము కేవలం మంచినీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామని ముంబై కార్పొరేషన్ తెలపగా... పిచ్‌ల కోసం వినియోగించే నీటిని తాము బయటి నుంచి కొంటున్నామని బోర్డు న్యాయవాది చెప్పారు. దీనిపై విచారణను నేటికి వాయిదా వేశారు.