
భారత్‌కు కఠిన పరీక్ష
సెమీస్‌లో నేడు బెల్జియంతో అమీతుమీ
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ
యాంట్‌వార్ప్: లీగ్ దశ నుంచి స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగుతున్న భారత్‌కు.. వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో అసలు పరీక్ష ఎదురుకానుంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన బెల్జియంతో... భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. చివర్లో జస్‌జీత్ సింగ్ సూపర్ స్ట్రోక్స్‌తో క్వార్టర్స్‌లో మలేసియాను చిత్తు చేసిన టీమిండియాకు బెల్జియం స్ట్రయికర్ల నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉంది.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌ను బెల్జియం స్ట్రయికర్లకు భారత డిఫెన్స్‌కు మధ్య పోరాటంగా చెప్పుకోవచ్చు. అయితే 2011 చాంపియన్స్ చాలెంజ్ ఫైనల్ తర్వాత ఇటీవల బెల్జియంతో తలపడ్డ ప్రతిసారి భారత్ పైచేయి సాధించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. మలేసియాతో మ్యాచ్‌లో భారత ఫార్వర్ట్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
బంతిని ప్రత్యర్థి జట్టు డి-సర్కిల్‌లోకి తీసుకెళ్లినా లక్ష్యానికి చేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు. అలాగే పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంలో డ్రాగ్ ఫ్లికర్లు నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా స్టార్ ఫ్లికర్ రఘునాథ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గోల్‌కీపర్ శ్రీజేష్ మాత్రం ప్రత్యర్థుల దాడులను సమర్థంగా అడ్డుకుంటుండంతో గోల్స్ ఎక్కువగా నమోదు కావడం లేదు.
ఈ టోర్నీలో భారత్ ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కోచ్ వాన్ యాస్... బెల్జియంను తక్కువగా అంచనా వేయడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు లీగ్ దశలో మూడు విజయాలు, ఓ డ్రా చేసుకున్న బెల్జియం క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌ను చిత్తు చేసింది. ఓ వైపు భరించలేని ఎండ ఉన్నా ఆటగాళ్లు ఏమాత్రం అలసటకు గురికాకుండా మ్యాచ్ ఆడారు. అలాగే బెల్జియం ఆటగాళ్లు ఎప్పుడు ఎలా ఆడతారో ఊహించడం చాలా కష్టం. కాబట్టి ఈ మ్యాచ్‌లో అలసత్వం చూపితే భారత్‌కు ఓటమి తప్పదు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని బెల్జియం భావిస్తోంది.