కౌలూన్ (హాంకాంగ్): బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌ను సొంతం చేసుకునేందుకు భారత స్టార్ పీవీ సింధు మరో విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, గత ఏడాది రన్నరప్ సింధు 21–17, 21–17తో ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడుతుంది.
ముఖాముఖి రికార్డులో సింధు 3–7తో వెనుకబడి ఉంది. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో తై జు యింగ్‌ను చివరిసారి ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఏడాదిన్నర తర్వాత తొలిసారి రచనోక్‌తో ఆడిన సింధు ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి గేమ్ ఆరంభంలో 6–2తో ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. ఇక రెండో గేమ్‌లోనూ ఈ హైదరాబాద్ అమ్మాయి ఆధిపత్యం చలాయించింది. 10–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఈ ఏడాది సింధు సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్ షిప్‌లో రజత పతకం గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో సింధు గెలిస్తే ప్రకాశ్ పదుకొనె (1982లో), సైనా నెహ్వాల్ (2010లో) తర్వాత హాంకాంగ్ ఓపెన్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది.
మధ్యాహ్నం గం. 1.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment