
ఆ రోజులు భయానకం
* అయినా పోరాటం ఆపలేదు
* యువరాజ్ సింగ్ మనసులో మాట
కోల్‌కతా: భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యానని స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. అదో బాధాకర దశగా అతను అభివర్ణించాడు. ‘ప్రపంచకప్ తర్వాతి రోజులు ఎంతో భయంకరంగా గడిచాయి. ఇంతకంటే ఘోరంగా పరిస్థితులు ఉండవేమో అనిపించింది. అయితే అదంతా గతం. ఆ తర్వాత నేను పోరాడాను. మానసికంగా మరింత దృఢంగా తయారయ్యాను’ అని ఆదివారం ఇక్కడ జరిగిన కోల్‌కతా 25 కిలోమీటర్ల రేసుకు అతిథిగా హాజరైన సందర్భంగా యువీ పేర్కొన్నాడు.
2014 ఏప్రిల్‌లో చివరిసారి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువీ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే టి20లకు ఎంపికయ్యాడు. ఏడాదిన్నర పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న తర్వాత దేశవాళీలో ఆడేలా స్ఫూర్తి పొందడం అంత సులువు కాదని... అయితే తనకు మరో దారి లేదు కాబట్టి పట్టుదల కనబర్చానన్నాడు. ఈ అవకాశాన్ని తాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటానని యువరాజ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
‘ఆస్ట్రేలియా లో ఆడటం అంత సులువు కాదు. అయితే అవకాశం దక్కడం సంతోషం. ప్రపంచకప్‌కు కూడా ఎంపికవుతాననే నమ్మకముంది. గతంలోలాగే బా గా ఆడాలని అంతా కోరుకుంటారు కాబట్టి ఒత్తిడి ఉండటం సహజం’ అని ఈ పంజాబీ ధీమా కనబర్చాడు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కు టుంబ సభ్యులు, స్నేహితులతో పాటు తన ధార్మిక గురువుకు కూడా యువీ కృతజ్ఞతలు తెలిపాడు.