'ఆయన్ను ఎలా మరచిపోతాం'
కాన్పూర్:భారత జట్టు 500వ టెస్టు ఆడుతున్న సందర్భంగా పలువురు మాజీ కెప్టెన్లను బీసీసీఐ సన్మానించిన సంగతి తెలిసిందే. వీరిలో అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, కె.శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, మొహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఉండగా, బిషన్ సింగ్ బేడీతో పాటు, గుండప్ప విశ్వనాథ్ లు మాత్రం సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
అయితే గత కొన్ని రోజులు క్రితం తనకు బీసీసీఐ నుంచి ఎటువంటి ఆహ్వానం రాలేదని బిషన్ సింగ్ బేడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణం చేతనే బేడీ సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉన్నారని భావించినా.. అందులో ఎటువంటి వాస్తవం లేదని ఐపీఎల్ చైర్మన్, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి బిషన్ సింగ్ బేడీ హాజరు కాకపోవడాన్ని బీసీసీఐకి జరిగిన నష్టంగా అభివర్ణించిన శుక్లా.. ఓ దిగ్గజ ఆటగాడ్ని పిలువ కూడదనే ఆలోచన ఎలా చేస్తామని ప్రశ్నించారు. జాతీయ వార్తా పత్రిక ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో బిషన్ సింగ్ బేడీ గైర్హజరీపై శుక్లా స్పందించారు.
'500వ టెస్టు మ్యాచ్ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ బేడీకి ఈ-మెయిల్ చేశా. దాంతో పాటు ఫోన్ లో కూడా కాంటాక్ట్ చేయాలని యత్నించా. బిషన్ సింగ్ బేడీ అందుబాటులోకి రాలేదు. నాకు బేడీ అంటే విపరీతమైన అభిమానం. విద్యార్థి దశ నుంచి ఆయన ఆటను చూస్తూ పెరిగాను. ఈ గ్రీన్ పార్క్ స్టేడియంలో బేడీ కొట్టిన సిక్సలు ఇప్పటికీ నాకు గుర్తే. 22 టెస్టులకు సారథిగా వ్యవరించిన బేడీని పిలవకూడదనే ఆలోచన బీసీసీఐ చేయలేదు' అని శుక్లా పేర్కొన్నారు.