Afg vs NZ: ‘చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము’ | AFG Vs NZ: Huge Mess Never Coming Back, Afghanistan Slam Facilities In Noida Stadium, Check Out The Details | Sakshi
Sakshi News home page

Afg vs NZ: ‘చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము’

Published Tue, Sep 10 2024 12:19 PM | Last Updated on Tue, Sep 10 2024 2:51 PM

Afg vs NZ: Huge Mess Never Coming Back: Afghanistan Slam Facilities In Noida Stadium

న్యూజిలాండ్‌తో తమ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నోయిడా స్టేడియంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. కనీస వసతులు కూడా లేవంటూ పెదవి విరిచారు. ఇలాంటి చోట ఇంకోసారి అడుగు కూడా పెట్టబోమంటూ ఘాటు విమర్శలు చేశారు.

తటస్థ వేదికలపై
కాగా తమ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి  తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడుతోంది అఫ్గన్‌ జట్టు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లేదంటే భారత్‌ వేదికగా ప్రత్యర్థి జట్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గతంలో గ్రేటర్‌ నోయిడాలోని షాహిద్‌ విజయ్‌ పాతిక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను హోం గ్రౌండ్‌గా చేసుకుని పలు మ్యాచ్‌లు ఆడింది అఫ్గన్‌ జట్టు. 

వర్షం కురవనేలేదు.. అయినా..
ఈ క్రమంలో న్యూజిలాండ్‌ వంటి పటిష్ట జట్టుతో తొలిసారి టెస్టు ఆడేందుకు సిద్ధమైన మరోసారి నోయిడాకు విచ్చేసింది. అయితే, సోమవారం(సెప్టెంబరు 9) మొదలుకావాల్సిన అఫ్గన్‌- కివీస్‌ మ్యాచ్‌కు ప్రతికూల పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఫలితంగా ఇరుజట్ల మధ్య  మొదలుకావాల్సిన ఏకైక టెస్టు తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. 

నిజానికి సోమవారం ఏమాత్రం వర్షం కురవనేలేదు. కానీ కొన్నిరోజుల పాటు కురిసిన కుండపోత వర్షాల వల్ల  నోయిడా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్‌ ఆడేందుకు గ్రౌండ్‌ ఏమాత్రం అనుకూలంగా లేదు.

ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ లేదు
దీంతో ఆటగాళ్లు మైదానంలో దిగే అవకాశమే లేకపోవడంతో పలుమార్లు స్టేడియాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా చేసేదేమి లేక తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏదీ ఇక్కడ లేకపోవడంతో మైదానం తడారిపోయేందుకు ఎండకాయాల్సిందే! కాబట్టి.. దీని కారణంగా  మ్యాచ్‌పై ఎన్నిరోజులు ప్రభావం పడుతుందో స్పష్టంగా చెప్పడం కష్టం.

చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము
ఈ నేపథ్యంలో అఫ్గన్‌ బోర్డు అధికారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘ఇక్కడి పరిస్థితి చెత్తగా ఉంది. ఇంకోసారి ఇక్కడకు రాకూడదని నిశ్చయించుకున్నాం. ఇక్కడ కనీస వసతులు లేవు. మా ఆటగాళ్లు కూడా నిరాశకు లోనయ్యారు. నిజానికి.. గతంలో మేము ఇక్కడకు వచ్చినపుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది.

మాకు సొంతగడ్డ లాంటిది
అందుకే ముందుగానే సంబంధిత అధికారులతో మాట్లాడాము. మాకు ఎలాంటి ఇబ్బంది కలగబోదని స్టేడియం వాళ్లు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ఏమాత్రం అభివృద్ధి చెందలేదు’’ అని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ మ్యాచ్‌ షెడ్యూల్‌ ఖరారు కాగానే.. అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది బీసీసీఐ, ఏసీబీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 

భారత్‌ తమకు సొంతగడ్డ లాంటిదని.. ఇక్కడ తాము ఆడబోయే మ్యాచ్‌కు మంచి వేదికను ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే, పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటంతో అతడు కూడా నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. కాగా 2017లో టెస్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్‌ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి.. ఆరింట ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్‌తో అఫ్గన్‌ ఆడుతున్న తొలి టెస్టు ఇదే!  

చదవండి: ముషీర్‌ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్‌.. టీమిండియాలో చోటు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement