డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై విజయం సాధించే అవకాశాన్ని హైదరాబాద్ జట్టు చేజార్చుకుంది.
రంజీ ట్రోఫీ సెమీస్‌లో ముంబై
రాయ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై విజయం సాధించే అవకాశాన్ని హైదరాబాద్ జట్టు చేజార్చుకుంది. మంగళవారం ముగిసిన రంజీ ట్రోఫీ ఐదు రోజుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 121/7తో ఆట చివరిరోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ మరో 80 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లను ముంబై బౌలర్ అభిషేక్ నాయర్ తీయడం విశేషం.
బాలచందర్ అనిరుధ్ (84 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిలింద్ (29; 4 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించడంతో హైదరాబాద్ జట్టులో విజయంపై ఆశలు చిగురించాయి. అయితే మిలింద్ అవుటయ్యాక హైదరాబాద్ కోలుకోలేకపోయింది. ఒకవైపు అనిరుధ్ పట్టుదలతో ఆడినా మరోవైపు ఆఖరి బ్యాట్స్‌మన్ రవి కిరణ్ (1) కూడా నాయర్ బౌలింగ్‌లో అవుటవ్వడంతో హైదరాబాద్‌కు పరాజయం తప్పలేదు. జనవరి 1 నుంచి 5 వరకు సెమీఫైనల్స్ జరుగుతాయి. నాగ్‌పూర్‌లో జార్ఖండ్‌తో గుజరాత్... రాజ్‌కోట్‌లో తమిళనాడుతో ముంబై తలపడతాయి.