సెంచరీతో ఆదుకున్న సిద్ధేశ్‌ | Century assisted with the siddhesh | Sakshi
Sakshi News home page

సెంచరీతో ఆదుకున్న సిద్ధేశ్‌

Published Fri, Dec 23 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

సెంచరీతో ఆదుకున్న సిద్ధేశ్‌

సెంచరీతో ఆదుకున్న సిద్ధేశ్‌

ముంబై 250/5 ∙హైదరాబాద్‌తో రంజీ క్వార్టర్స్‌

రాయ్‌పూర్‌: హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌... ఒక దశలో ముంబై 34 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్‌ బౌలర్లు సీవీ మిలింద్‌ (3/64), సిరాజ్‌ (2/58) చెలరేగడంతో ఆ జట్టు టాపార్డర్‌ తడబడింది. అయితే సిద్ధేశ్‌ లాడ్‌ (101 బ్యాటింగ్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో ముంబైని ఆదుకున్నాడు. ఫలితంగా మ్యాచ్‌ మొదటి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్లకు 250 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఆదిత్య తారే (73; 14 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో లాడ్‌తో పాటు అభిషేక్‌ నాయర్‌ (46 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) ఉన్నాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 111 పరుగులు జత చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ కెవిన్‌ అల్మీడా (9)ను అవుట్‌ చేసి తొలి వికెట్‌ అందించిన మిలింద్‌... మరో రెండు బంతులకే ముంబై స్టార్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (0)ను పెవిలియన్‌కు పంపించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (5)ను సిరాజ్‌ అవుట్‌ చేయగా, ప్రఫుల్‌ వాఘేలా (13)ను మిలింద్‌ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో సిద్ధేశ్, తారే కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించిన అనంతరం సిరాజ్‌ బౌలింగ్‌లోనే తారే వెనుదిరిగాడు. ఆ తర్వాత లాడ్‌ 194 బంతుల్లో కెరీర్‌లో నాలుగో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

88 పరుగులకే కుప్పకూలిన కర్ణాటక
సాక్షి, విశాఖపట్నం: తమిళనాడు మీడియం పేసర్‌ అశ్విన్‌ క్రైస్ట్‌ (6/31) అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో ఇక్కడ ప్రారంభమైన మరో మ్యాచ్‌లో కర్ణాటక మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. మనీశ్‌ పాండే (28)దే అత్యధిక స్కోరు. దట్టమైన పచ్చికతో సీమ్‌కు అనుకూలించిన పిచ్‌పై అశ్విన్‌ చెలరేగిపోవడంతో కర్ణాటక బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ నిలబడలేకపోయారు. చెన్నై టెస్టు హీరోలు కరుణ్‌ నాయర్‌ (14), కేఎల్‌ రాహుల్‌ (4) విఫలమయ్యారు. అనంతరం తమిళనాడు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. విజయ్‌ శంకర్‌ (34), దినేశ్‌ కార్తీక్‌ (31 బ్యాటింగ్‌) నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించి జట్టును నడిపించారు. ప్రస్తుతం తమిళనాడు 23 పరుగుల ఆధిక్యంలో ఉంది.  

గుజరాత్‌ 197/6
జైపూర్‌: ఒడిషాతో జరుగుతున్న క్వార్టర్స్‌ మ్యాచ్‌లో తొలి రోజు గుజరాత్‌ 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. 71 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా... చిరాగ్‌ గాంధీ (62 బ్యాటింగ్‌), రుష్‌ కలారియా (59 బ్యాటింగ్‌) ఏడో వికెట్‌కు అభేద్యంగా 126 పరుగులు జోడించి ఆదుకున్నారు. దీపక్‌ బెహెరాకు 3 వికెట్లు దక్కాయి.

నదీమ్‌కు 5 వికెట్లు
వడోదర: జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి హరియాణా 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. రజత్‌ పలివాల్‌ (42), చైతన్య బిష్ణోయ్‌ (41) ఫర్వాలేదనిపించారు. జార్ఖండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ (5/75) ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement