వివాదాలతో రాటుదేలా ! | I became strong through disputes says sania | Sakshi
Sakshi News home page

వివాదాలతో రాటుదేలా !

Published Wed, Oct 29 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

వివాదాలతో రాటుదేలా !

వివాదాలతో రాటుదేలా !

సాక్షి, హైదరాబాద్: గ్రాండ్‌స్లామ్ గెలుపు... డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టైటిల్... మరో రెండు టైటిల్స్...ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్యాలు... హైదరాబాదీ సానియామీర్జా కెరీర్‌లో ఇదో అద్భుత సంవత్సరం. విజయంతో సీజన్‌ను ముగించిన భారత టెన్నిస్ స్టార్, దశాబ్ద కాలపు అంతర్జాతీయ కెరీర్ తర్వాత కూడా కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన సానియా మంగళవారం తన అకాడమీలో మీడియాతో మాట్లాడింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకుంటానంటున్న మీర్జా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే...

 2014లో ప్రదర్శన: అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఒక టెన్నిస్ ప్లేయర్ ఏడాది కాలంలో ఏఏ విజయాలు సాధించాలని కోరుకుంటారో నాకు అవన్నీ దక్కాయి. నిజంగా ఈ ఏడాది అద్భుతంగా సాగింది. 2013 సీజన్ చివర్లో కూడా నేను సంతృప్తి వ్యక్తం చేశాను. అయితే తర్వాతి సంవత్సరం ఇంత బాగుంటుందని నాడు నేను కూడా ఊహించలేదు. టోర్నీ టైటిల్సే కాకుండా ఆసియా క్రీడల్లో వచ్చిన పతకాలు కూడా ఎంతో సంతోషాన్నిచ్చాయి. అన్నింటికి మించి డబ్ల్యూటీఏ ఫైనల్స్ గెలవడం అంటే నా దృష్టిలో ప్రపంచ విజేతగా నిలిచినట్లే. ఆటగాళ్ల స్థాయి, పోటీతో పోలిస్తే గ్రాండ్‌స్లామ్‌కంటే కూడా ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే నా కెరీర్‌లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌కంటే ఇదే పెద్ద విజయం. నా అదృష్టాన్ని నేను రాసుకునే అవకాశం ఉంటే ఇలాగే రాసేదాన్నేమో!

 టోర్నీ సెమీస్, ఫైనల్‌లో ప్రదర్శన: సెమీస్‌లో విజయం అనూహ్యం. రెండో సెట్‌లో మ్యాచ్ పాయింట్‌కు ముందు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నాం. చివరి ప్రయత్నం అనుకొని సర్వీస్ చేశాను. ర్యాలీ అనంతరం నా రిటర్న్‌ను అనూహ్యంగా ఆమె వదిలేసింది. సాధారణంగా అలాంటి పాయింట్‌లు మనకు లభించవు. కానీ అదృష్టం కలిసొచ్చింది. స్కోర్లు సమం చేయడంతో పాటు దూసుకెళ్లి మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాం. ఫైనల్‌కు ముందు మాత్రం ఆందోళన చెందలేదు. ఓడినా ఫర్వాలేదనుకున్నాం. పైగా ప్రత్యర్థుల ఫైనల్ రికార్డు బాగుంది. వాళ్లు ఏకంగా 12 ఫైనల్స్‌లో ఓటమిని చూడలేదు. అందరూ అదే చెప్పారు. కానీ అనూహ్యంగా మేం వారిని చిత్తుగా ఓడించాం.

 కారాబ్లాక్‌తో విడిపోవడం: ఇదేమీ మా ఇద్దరికీ పడలేదనో, భేదాభిప్రాయాల వల్లనో విడిపోవడం లేదు. ఇంత గొప్ప విజయం మాకు ఆఖరిది కావడం బాధగా ఉంది. ఆట మాత్రమే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా కోరుకుంటోంది. దానిని నేను గౌరవిస్తాను. కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నాను కాబట్టి మరో భాగస్వామితో కొనసాగాలి. సీ సు వీ (చైనీస్ తైపీ)తో తొలిసారి ఆడబోతున్నాను. ఆమె అత్యుత్తమ డబుల్స్ ప్లేయర్. వచ్చే ఆడాది ఆమెతో కలిసి కూడా బాగా ఆడతాననే నమ్మకముంది.

 ఓవరాల్‌గా కెరీర్‌పై:  నాకు టెన్నిస్ ఆడటం తప్ప మరొకటి తెలీదు. విజయం సాధించేందుకు ఎలాంటి రహస్యాలు ఉండవు. ఒక్కసారిగా అద్భుతాలు కూడా జరగవు. కష్టపడటం ఒక్కటే మార్గం. గత 21 ఏళ్లుగా నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు కూడా మరో దాని గురించి ఆలోచించడం లేదు. వైఫల్యాలు ఎదురైనప్పుడు మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.

 ఇటీవలి విమర్శలు: నిజాయితీగా చెప్పాలంటే వివాదాలను రేపిన వారికి నా కృతజ్ఞతలు! ఎందుకంటే ఇవి నన్ను మరింతగా రాటుదేల్చాయి.  మ్యాచ్‌లో పోరాడటమే ఇప్పటి వరకు నాకు తెలుసు. ఇప్పుడు బయట ఎలా పోరాడాలో కూడా తెలిసింది. కఠిన సమయాల్లో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకున్నాను. అయితే ఇదేమీ నాకు మొదటిసారి కాదు. ఏళ్లుగా సాగుతూనే ఉంది. అయితే ఆ కొంతమందిని తప్పిస్తే దేశమంతా నాకు బహిరంగంగా అండగా నిలిచింది. నా విజయాలతో ప్రజలంతా సంతోషించారనేది వాస్తవం.
 
వచ్చే సీజన్‌పై: సీజన్ ముగిసింది కాబట్టి ప్రస్తుతం కొంత విరామం లభించింది.

దీనిని విశ్రాంతికే కేటాయిస్తాను. అయితే డిసెంబర్‌లోనే ఐపీటీఎల్ జరుగుతోంది కాబట్టి మళ్లీ ఆట మొదలు పెట్టాల్సి ఉంది. ఈ టోర్నీ గొప్ప ఆలోచన. టెన్నిస్‌కు ఇప్పటికే గుర్తింపు ఉంది. ఈ టోర్నీ వల్ల దాని స్థాయి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నా. ఇక అంతర్జాతీయ సర్క్యూట్‌లో చూస్తే డబ్ల్యూటీఏ విజయంతో పెద్ద ఘనత దక్కింది. కాబట్టి నా తదుపరి లక్ష్యం ప్రపంచ నంబర్‌వన్ కావడమే. వచ్చే ఏడాది దానిపై దృష్టి పెట్టాను. ఇటీవల నా ప్రదర్శన చూస్తే నేను దానికి చేరువలో ఉన్నాననే భావిస్తున్నా.
 
 రాష్ట్రపతి అభినందనలు
 న్యూఢిల్లీ: డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ నెగ్గిన భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా అభినందించారు. సానియా విజయం పట్ల తాను చాలా గర్వపడుతున్నానని, మన దేశంలోని యువతకు ఈ గెలుపు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి అన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఘనతలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement