
'భారీ సిక్సులు కొట్టడం నా వల్ల కాదు'
మిర్పూర్: ప్రపంచంలో ఉత్తమ ఆటగాళ్లలో అతడికి ఎప్పుడూ చోటుంటుంది. భారత యువ సంచలనంగా పేరు గాంచిన బ్యాట్స్ మన్ అతడు. అతడు క్రీజులో ఉంటే చాలు ఎన్ని పరుగుల లక్ష్యం ఎదురుగా ఉన్న ఛేదిస్తామన్న నమ్మకం కెప్టెన్ కు ఉంటుంది. అయినా అతడిలో ఏదో చిన్న వెలితి ఉన్నట్లు కనిపిస్తోంది. అతడు మరెవరో కాదు టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాను ఇతర ఆటగాళ్ల తరహాలో భారీ సిక్సర్స్ బాదలేనని కోహ్లీ పేర్కొన్నాడు. ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా భారత్ నేడు బంగ్లాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ముందురోజు కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. టీ20ల్లో ప్రతి జట్టు ప్రమాదకరేనని, తమదైన రోజును ఏ జట్టు అయినా సరే తమ ప్రత్యర్థులను సులువుగా ఓడించగలుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాస్త విరామం దొరకడంతో పునరుత్తేజంతో బరిలోకి దిగుతామన్నాడు.
ఇప్పుడు నా శైలి మారింది
తాను ఇప్పటికే 33 టీ20 మ్యాచ్ లు ఆడినప్పటికీ కేవలం 27 సిక్సర్స్ కొట్టానని, బౌండరీలు అయితే 127 కొట్టినట్లు చెప్పాడు. భారీ సిక్సర్స్ కొట్టడం తనవల్ల కాదని, అందుకే ఎక్కువగా ఫోర్లు బాదేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. టీ20 తొలిరోజుల్లో పది బంతులకు పది పరుగులు చేయాలని భావించేవాడినని, ఆ తర్వాత తన దృక్పథంలో మార్పు వచ్చిందన్నాడు. ఏ ప్రత్యర్థి జట్టును తాము తక్కువ అంచానా వేయడం లేదని, అన్ని జట్లను బలమైన ప్రత్యర్థులుగా స్వీకరిస్తామన్నాడు. గతేడాది మా జట్టు 1-2తో బంగ్లాతో ఓటమి పాలైన విషయాన్ని ప్రస్తావించాడు. బౌలర్ ముస్తాఫిజర్ అద్భుత ప్రదర్శన కారణంగా తమ ఓటమి తప్పలేదన్నాడు.