హాంకాంగ్: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్ చేరింది. భారీ వర్షం కారణంగా భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రద్దయింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు.
లీగ్ మ్యాచ్‌లు ముగిశాక భారత్, పాక్ జట్లు నాలుగు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ నుంచి సెమీఫైనల్‌కు చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంకతో భారత్; బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలపడతాయి.
బంగ్లాదేశ్ భారీ విజయం.. టెస్టు క్రికెట్ చరిత్రలో..
మిర్పూర్: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో లిటన్ దాస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఏకంగా 546 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. 662 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 33 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది.
ఓవర్‌నైట్ స్కోరు 45/2తో ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గానిస్తాన్ మరో 70 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్ (4/37), షోరిఫుల్ ఇస్లాం (3/28) అఫ్గానిస్తాన్‌ను దెబ్బ తీశారు. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ షాంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు.
మొత్తం టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల తేడా పరంగా బంగ్లాదేశ్‌ది మూడో అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ జాబితాలో ఇంగ్లండ్ (1928లో ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో గెలుపు), ఆస్ట్రేలియా (1934లో ఇంగ్లండ్‌పై 562 పరుగుల తేడాతో గెలుపు) జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment