ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా
తీహార్ జైల్లో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన కూడా పేసర్ శ్రీశాంత్కు వచ్చిందట. అయితే, ఎలాగోలా ఆ ఆలోచనల నుంచి బయటపడి, ఇప్పుడు మచ్చ కూడా తుడిచేసుకున్న ఈ కేరళ కుర్రాడు.. తనపై నిషేధం ఎత్తేయాల్సిందిగా బీసీసీఐని కోరాలని అనుకుంటున్నాడు. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అపాయింట్మెంట్ కోరానని శ్రీశాంత్ చెప్పాడు. బీసీసీఐ పెద్దలు తన విషయంలో సానుకూలంగా ఆలోచించడం చాలా సంతోషకరమని, వాళ్ల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నానని తెలిపాడు.
క్రికెట్ బెట్టింగ్ రాకెట్తో తనకు సంబంధాలున్నాయని, దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ లాంటివాళ్లతో లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో తనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు తాను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదని శ్రీశాంత్ తెలిపాడు. అయితే.. శివారాధనతోనే తాను ఆ భావనల నుంచి బయట పడినట్లు చెప్పాడు. తాను ఇప్పటికీ వేచి చూస్తానని, ఎవరిమీదా దావాలు వేయాలన్న ఆలోచన లేదని, ఇప్పటికీ క్రికెట్ ఆడాలన్నదే తన కోరిక అని చెప్పాడు. తనపై విధించిన జీవితకాల నిషేధం ఎత్తేసిన తర్వాత మాత్రమే తాను ప్రాక్టీసు మళ్లీ మొదలుపెడతానని శ్రీశాంత్ అన్నాడు.