'రికార్డు గురించి తెలియదు'
క్రిస్ట్చర్చ్: తాను టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నమోదు చేసిన విషయం క్రీజ్లో ఉన్నప్పుడు తెలియదని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ స్సష్టం చేశాడు. తాను క్రీజ్లోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ బంతిని బౌండరీ దాటించే యత్నం మాత్రమే చేశానన్నాడు. అది ఇలా రికార్డుగా నమోదు అవుతుందని అస్సలు ఊహించలేదని మెకల్లమ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో శనివారం ఆరంభమైన రెండో టెస్టులో మెకల్లమ్ 54 బంతుల్లో శతకం సాధించాడు. తద్వారా 1986లో ఇంగ్లాండ్ పై విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 56 బంతుల్లో సెంచరీ కొట్టిన రికార్డుతో పాటు ఆ తర్వాత 2014లో ఆస్ట్రేలియాపై పాకిస్థానీ బ్యాట్స్ మన్ మిస్బావుల్ హక్ 56 పరుగుల్లోనే 100 పరుగులు చేసిన రికార్డులను మెకల్లమ్ చెరిపేశాడు.
దీనిపై ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన మెకల్లమ్.. తాను బ్యాట్ తో పరుగులు వర్షం కురిపించాలని మాత్రమే ప్రయత్నించానన్నాడు. ఆ క్రమంలో బౌలర్లపై ఎదురుదాడికి దిగి ప్రతీ బంతిని బౌండరీ దాటించే యత్నం చేశానన్నాడు. తన ఆదర్శ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ రికార్డును అధిగమించడం చాలా గర్వంగా ఉందన్నాడు. ఈ రికార్డు కంటే మ్యాచ్ లో గెలుపే ముఖ్యమని మెకల్లమ్ తెలిపాడు. ఈ ఇన్నింగ్స్ లో మెకల్లమ్(145;79 బంతుల్లో 21 ఫోర్లు,6 సిక్సర్లు) భారీ సెంచరీ సాధించాడు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో కూడా మెకల్లమ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఆ వన్డే మ్యాచ్ లో 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో మెకల్లమ్ 47 పరుగులు చేశాడు. మరోవైపు కివీస్ తరపున టెస్టుల్లో ఏకైక ట్రిపుల్ సెంచరీ చేసిన ఘనత మెకల్లమ్ పేరిటే ఉండటం విశేషం.