
న్యూఢిల్లీ: చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తన ఎంపికపై చేసిన వ్యాఖ్యలను ఆశిష్ నెహ్రా తప్పుబట్టాడు. కివీస్‌తో సిరీస్ వరకే తన పేరును పరిశీలిస్తామని ఆ తర్వాత చర్చించమని ఎమ్మెస్కే... నెహ్రాతో చెప్పినట్లు వార్తలొచ్చాయి. అందువల్లే మీరు తప్పుకున్నారా అని మీడియా ప్రశ్నించగా ఢిల్లీ మాజీ సీమర్ ఘాటుగా బదులిచ్చాడు. ‘అప్పుడు ఆటలోకి సెలక్టర్ల అనుమతితో రాలేదు... ఇప్పుడు ఆట నుంచి సెలక్టర్ల అనుమతితో నిష్క్రమించడం లేదు’ అని చురక అంటించాడు. 18 ఏళ్ల కెరీర్‌కు నెహ్రా బుధవారం కివీస్‌తో జరిగిన మ్యాచ్‌తో గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. టి20 జట్టు ఎంపిక చేసిన సమయంలో ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ‘ఢిల్లీ మ్యాచ్‌లో నెహ్రాను ఆడిస్తామనే హామీ ఇవ్వలేదు. ఈ విషయాన్ని అతనికి చెప్పాం. తుది జట్టులో ఆడటంపై టీమ్ మేనేజ్‌మెంట్‌దే నిర్ణయాధికారం’ అని స్పష్టం చేశారు. దీనిపై నెహ్రా చిటపటలాడాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌తో తాను ఆడేదీ లేనిది చర్చించలేదని చెప్పాడు. ఆయనెందుకు ఇలా చెప్పారో తనకు తెలీదన్నాడు. ‘నా రిటైర్మెంట్‌పై తొలుత నేను మాట్లాడింది కోహ్లితోనే. కోచ్ రవిశాస్త్రికీ ఈ విషయం చెప్పాను. వీళ్లిద్దరు మినహా ఇంకెవరితోనూ ముచ్చటించలేదు’ అని 38 ఏళ్ల నెహ్రా అన్నాడు. అదృష్టవశాత్తూ సొంతగడ్డ (ఢిల్లీ)పై చివరి మ్యాచ్ ఆడే అవకాశం లభించిందన్నాడు.
వ్యాఖ్యానమా... శిక్షణా?
ముందస్తు ప్రణాళికతోనే రిటైరైనప్పటికీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌పై నెహ్రా ఇంకా నిర్ణయించుకోలేదు. బౌలింగ్ కోచ్‌గా వస్తాడా లేక క్రికెట్ వ్యాఖ్యాతగా మారతాడా అనే విషయంపై చెప్పలేకపోయాడు. ‘తర్వాత ఏంటో నాకైతే తెలియదు. నేనింకా దీనిపై తీరిగ్గా కూర్చుని ఆలోచించలేదు. తదుపరి కోచింగా... వ్యాఖ్యానమా అనేది ఇప్పుడే చెప్పలేను. ఫేర్‌వెల్ గేమ్‌లో నా చివరి ఓవర్‌ను పూర్తి చేయల్సిందిగా కోహ్లి బంతిని అప్పగించడం మరవలేను. ఆఖరి ఓవర్ నా భావోద్వేగాల్ని తడిమింది. అప్పుడు నేను 1997లో హరియాణాపై వేసిన తొలి ఓవర్ గుర్తొచ్చింది’ అని అన్నాడు. బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ గేమ్‌లో కొత్త బంతులతో బౌలర్లకు ఎప్పుడు సవాళ్లేనన్నాడు. ‘ఒకప్పుడు 200 పరుగులే గొప్ప తర్వాత 250... ఆ తర్వాత 300 ఇప్పుడు 350కి చేరింది. దీనికి విరుగుడు ఒకే కొత్తబంతిని ఇవ్వాలి. సర్కిల్‌కు ఆవల ఐదుగురు ఫీల్డర్లను వినియోగించాలి. దీంతో 350 కాస్త 320కి... క్రమంగా 280కి తగ్గుతుంది’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment