ఐసీసీ ఏం చెప్పాలనుకుంటోంది!
బీసీసీఐ ఏం చెబితే అది ఐసీసీకి వేదవాక్కు... ఇదీ ఇంతకాలం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల ఆలోచన. కానీ అండర్సన్, జడేజా వివాదంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తప్పు చేశానని అండర్సన్ చెప్పినా... సాక్ష్యాలు లేవంటూ శిక్ష విధించలేదు. ఈ అంశంలో బీసీసీఐ చాలా సీరియస్‌గా వ్యవహరించినా... ఐసీసీ నుంచి మాత్రం బోర్డుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీని ద్వారా ఐసీసీ ఏం చెప్పాలనుకుంటోంది?
►అండర్సన్ తప్పు ఒప్పుకున్నా శిక్ష ఎందుకు పడలేదు?
►తొలిసారి భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న సిరీస్‌లో అండర్సన్ పదే పదే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నాడు. అయినా ఐసీసీ కనీసం వివరణ కోరడం లేదు. తొలి టెస్టులో జడేజాతో వివాదం తర్వాత... నిషేధం గురించి ఏ మాత్రం భయపడని అండర్సన్ మూడో టెస్టులోనూ రహానేతో కయ్యం పెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఐసీసీ దేనినీ పట్టించుకున్నట్లు లేదు. తాను జడేజాపై చేయి వేశానని ఇంగ్లండ్ పేసర్ ఒప్పుకున్నా...సాక్ష్యాలు లేవంటూ శిక్ష తప్పించుకున్నాడు.
బీసీసీఐ ఆగ్రహం...: అండర్సన్‌కు ఎలాంటి శిక్ష పడకపోవడం బీసీసీఐకి ఆగ్రహం కలిగించింది. ‘అతడి పేరు ఉచ్ఛరించడానికి కూడా నేను ఇష్టపడను’ అని ధోని వ్యాఖ్యానించాడంటే ఈ విషయాన్ని భారత బృందం ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఈ కేసులో తీర్పు పూర్తిగా తప్పు. ఇది ఒక చెడ్డ ఉదాహరణగా నిలిచిపోతుంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తాజాగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అండర్సన్ విషయంలో అసలు బీసీసీఐని ఐసీసీ లెక్క చేసినట్లే కనిపించడం లేదని ఆయన ఆవేశంగా అన్నారు. ‘ఈ ఉదంతంలో వరుసగా తప్పులు జరిగాయి. ముందు జడేజాను రిఫరీ శిక్షించారు. ఆ తర్వాత దానిని తొలగించారు.
జడేజాను అండర్సన్ నెట్టడం రుజువైంది. అతనే స్వయంగా చెప్పాడు. అయినా అతడిని దోషిగా గుర్తించలేదు. అంపైర్ ఆక్సెన్‌ఫర్డ్ మైదానంలో తిట్లు ఆపాల్సిందిగా కోరారు. కానీ నిబంధనలు ఉల్లంఘించడంపై ఫిర్యాదు చేయలేదు. ఐసీసీ చాలా అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మా తరఫున మాట్లాడాలి...: ఇంతా జరిగితే అండర్సన్‌పై చర్య తీసుకోకపోవడం దుర్మార్గమని బోర్డు అధికారి అభిప్రాయ పడ్డారు. ‘దీని ద్వారా యువ క్రికెటర్లకు ఏం సందేశం ఇవ్వదలిచారు. మీరు తోటి ఆటగాడిని తిట్టవచ్చు, తోసేయవచ్చు, కానీ హాయిగా తప్పించుకోవచ్చు అని చెబుతారా’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీసీసీఐ తమ ప్రయత్నాలు కొనసాగిస్తుందని, ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్ తమ తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
- సాక్షి క్రీడావిభాగం
రిచర్డ్‌సన్ అంగీకరిస్తారా...
జ్యుడీషియల్ కమిషనర్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయాలా? వద్దా? అనే నిర్ణయం ఇప్పుడు ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ చేతుల్లో ఉంది. అయితే తను ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కూడా భారత్‌కు చెందిన వారే కావడంతో ఈ వివాదంలో నొప్పింపక.. తానొవ్వక తరహాలో ఉండాలని డేవ్ భావిస్తున్నారు. ఈ నెల 10న ఒకవేళ రిచర్డ్‌సన్ అప్పీలుకు వెళితే 48 గంటల్లోగా ఐసీసీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ నుంచి ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. ఈ ప్యానెల్ చర్య తీసుకునేలోగా అండర్సన్ మిగతా రెండు టెస్టులూ ఆడే అవకాశం ఉంది.