దుబాయ్: కరోనా కారణంగా ఎదురైన సవాళ్లను అధిగమించి మళ్లీ క్రికెట్ మొదలు పెట్టడం, ప్రతిష్టాత్మక టి20 ప్రపంచ కప్ నిర్వహణపై స్పష్టత, ఇతర భవిష్యత్ పర్యటన కార్యక్రమాల (ఎఫ్‌టీపీ)పై మార్పులు చేర్పులు, ఐసీసీ కొత్త చైర్మన్ ఎంపిక... ఇలా ఎన్నో అంశాలపై చర్చించేందుకు సిద్ధమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చివరకు ఏమీ తేల్చకుండానే ముగించేసింది. టెలికాన్ఫరెన్స్ ద్వారా గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేదు. అన్నింటినీ జూన్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎజెండాలో ఉంచిన అన్ని అంశాలపై నిర్ణయం ఆ రోజే ప్రకటిస్తామని వెల్లడించింది. పొట్టి ప్రపంచకప్ వాయిదా ఖాయమని వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకుండా ఐసీసీ ఇంకా దాటవేట ధోరణిలోనే వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరం. మరో వైపు ఐసీసీ బోర్డు సమావేశాల్లో జరుగుతున్న అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం బయటకు వస్తుండటం పట్ల ఐసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఐసీసీ ఎథిక్స్ ఆఫీసర్‌తో అంతర్గత విచారణ జరిపేందుకు సభ్యులందరూ అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment