భారత్-బంగ్లా మ్యాచ్‌పై విచారణ!
- పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డిమాండ్
కరాచీ: నరాలు తెగే ఉత్కంఠ మధ్య అత్యంత హోరాహోరీగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఒకరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం, భద్రతా యూనిట్ దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
పాక్ తరఫున 34 టెస్టులు, 70 వన్డేలు ఆడిన స్పిన్నర్ తౌసీఫ్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మ్యాచ్ ముగిసిన తీరు చూస్తే.. ఏదో జరిగినట్టు నాకు తోస్తుంది. ఐసీసీ అధికారులు దీనిపై విచారణ జరుపాల్సిన అవసరముందని అనిపిస్తోంది' అని ఆయన పేర్కొన్నాడు. మూడు వికెట్లు చేతిలో ఉండగా మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ ప్రస్తుతం అనుభవరాహిత్యమున్న జట్టు కాదు. క్రీజులో వారికి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. అయినా ముందు ఒక సింగిల్ తీసి మ్యాచ్ టైకి ప్రయత్నించి.. ఆ తర్వాత భారీ షాట్ ఆడాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా వారు ఎందుకు భారీ షాట్లకు ప్రయత్నించారో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు స్లో బౌలింగ్ రేట్ కారణంగా బంగ్లాదేశ్‌పై ఐసీసీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.