
అశ్విన్ 'బెస్ట్' ర్యాంక్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో విశేషంగా రాణిస్తున్న టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంక్ ను సాధించాడు.
దుబాయ్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో విశేషంగా రాణిస్తున్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంక్ ను సాధించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న అశ్విన్ రెండో ర్యాంక్ లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 12 వికెట్ల తీసి అశ్విన్(856 పాయింట్లు) కెరీర్ బెస్ట్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా, బ్యాటింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మూడో స్థానానికి పడిపోయాడు. భారత్ తో సిరీస్ కు ముందు అగ్రస్థానంలో నిలిచిన ఏబీ.. రెండు స్థానాలు దిగజారాడు. కాగా, భారత ఆటగాడు మురళీ విజయ్ 12వ ర్యాంక్ సాధించి కెరీర్ లో టాప్ ర్యాంక్ కు చేరగా, విరాట్ కోహ్లి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 16వ స్థానంలో నిలిచాడు. టెస్టు జట్ల ర్యాంకింగ్స్ లో ఆసీస్ 109 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. అయితే ఆసీస్ కు భారత్ జట్టు నుంచి గట్టి పోటీ ఏర్పడింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ విజయం సాధిస్తే 110 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.