సౌద్ షకీల్- విరాట్ కోహ్లి
Pakistan And India stars reach new career highs after latest rankings update: పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకు సాధించాడు. తద్వారా టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో కలిసి టాప్-15లో చోటు దక్కించుకున్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంకతో తమ తొలి సిరీస్ ఆడుతోంది.
లంకతో మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ
ఈ క్రమంలో.. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో సౌద్ షకీల్ అద్భుత అజేయ ద్విశతకం(208)తో మెరిశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా పైకి దూసుకువచ్చాడు.
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ర్యాంకుల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. రోహిత్ పది, కోహ్లి 14 స్థానాల్లో కొనసాగుతుండగా.. యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒక స్థానం కోల్పోయి 12వ ర్యాంకుకు పడిపోయాడు.
నంబర్ 1గా అతడే.. అశ్విన్ సైతం అగ్రస్థానంలోనే..
ఇక టాప్-10 ర్యాంకుల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. నంబర్ 1గా కేన్ విలియమ్సన్ కొనసాగుతుండగా.. లబుషేన్, జో రూట్, ట్రవిస్ హెడ్, బాబర్ ఆజం వరుసగా ఆ తర్వాతి స్థానాలు ఆక్రమించారు. మరోవైపు.. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హవా కొనసాగుతోంది.
విండీస్ టూర్‌లో 14 వికెట్లతో అదరగొట్టిన అతడు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకు సాధించాడు. కాగా విండీస్‌తో రెండో టెస్టు డ్రా అయిన నేపథ్యంలో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది. పాకిస్తాన్ ప్రస్తుతం టాప్‌లో ఉంది.
చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా..
Comments
Please login to add a commentAdd a comment