సాక్షి, హైదరాబాద్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఘన నివాళి అర్పించారు. ఆయన 108వ జయంతి సందర్భంగా దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లోనూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ధ్యాన్‌చంద్ విగ్రహానికి శాప్ ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, శాప్ ఎండీ రాహుల్ బొజ్జ, క్రీడాశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం హాకీ మ్యాచ్ నిర్వహించారు. న్యూఢిల్లీలో ధ్యాన్‌చంద్‌పై తొలిసారి గ్రాఫిక్స్ రూపంలో జీవిత చరిత్రను ఆవిష్కరించారు. ‘ధ్యాన్‌చంద్-ది విజార్డ్ ఆఫ్ హాకీ’ పేరుతో రూపొందిన ఈ పుస్తకాన్ని గురువారం ఆయన 108వ జయంతి సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశి థరూర్ ఆవిష్కరించారు. ఒక క్రీడాకారుడిపై గ్రాఫిక్స్ రూపంలో పుస్తకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లలో ధ్యాన్‌చంద్ అద్భుత ప్రదర్శనతో పాటు భారత్ తరఫున ఆయన సాధించిన ఘనతలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు.
కామిక్ సిరీస్‌లు ప్రచురించడంలో గుర్తింపు ఉన్న అమర్ చిత్ ్రకథా సంపుటినుంచే ధ్యాన్‌చంద్ పుస్తకం కూడా వెలువడింది. ‘చిన్నారులకు స్ఫూర్తినిచ్చేందుకు ధ్యాన్‌చంద్ సరైన వ్యక్తి. ఆయన గురించి ఎక్కువ మంది తెలుసుకోవాలన్నదే మా ఆలోచన. ఇది ఆ మహనీయుడికి ఇస్తున్న నివాళిలాంటిది’ అని అమర్ చిత్రకథ ఎడిటర్ రీనాపురి చెప్పారు. హాకీ దిగ్గజంపై అనేక పరిశోధనలు చేసిన లూయిస్ ఫెర్నాండెజ్ స్క్రిప్ట్ రాసిన ఈ పుస్తకం వంద రూపాయల ధరకు మార్కెట్లో లభిస్తుంది.
ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి
Published Fri, Aug 30 2013 2:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement
Advertisement