అందరికీ కలిపి 10 లక్షలా..!
ప్రభుత్వ ప్రోత్సాహకంపై భారత కబడ్డీ ఆటగాడు అజయ్ నిరాశ
న్యూఢిల్లీ: కబడ్డీ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకం పట్ల జట్టు సభ్యుడు అజయ్ ఠాకూర్ నిరాశ వ్యక్తం చేశాడు. ఈ విజయానంతరం క్రీడా శాఖ మన జట్టుకు రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఇది చాలా చిన్న మొత్తం కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆటగాళ్ల కోసం ఏమీ ప్రకటించకపోవడం తనను ఆశ్చర్యపరచిందని అతను అన్నాడు. ‘కబడ్డీ మన దేశంలో ఇంతగా పాపులర్ అవుతుందని, నేను వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని అవుతానని అసలు ఏనాడూ ఊహించలేదు కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం.
అరుుతే మేము కోట్ల రూపాయలు కనకవర్షం కురిపించమని అడగడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తాన్ని అందరం పంచుకుంటే ఎంత వస్తుందో మీరే ఊహించుకోండి. ఆట ఏదైనా అందరికీ ఒకే తరహాలో ప్రోత్సాహం అందాలి కదా’ అని అజయ్ వ్యాఖ్యానించాడు. కబడ్డీ ప్రపంచకప్‌లో అజయ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.