‘విన్‌’డీస్‌ సాధ్యమేనా? | India For 2-Match Test Series vs Windies | Sakshi
Sakshi News home page

‘విన్‌’డీస్‌ సాధ్యమేనా?

Published Mon, Oct 1 2018 4:37 AM | Last Updated on Mon, Oct 1 2018 4:53 AM

India For 2-Match Test Series vs Windies - Sakshi

ఇంగ్లండ్‌లో పరాభవాన్ని మర్చిపోకముందే... ఆసియా కప్‌ విజయాన్ని ఆస్వాదిస్తుండగానే.. టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది... ప్రత్యర్థి... పెద్దగా ప్రమాదకరం కాని వెస్టిండీస్‌! చడీచప్పుడు లేకుండానే
అడుగుపెట్టేసిందా జట్టు! బోర్డు ప్రెసిడెంట్స్‌తో ప్రాక్టీస్‌ మ్యాచూ ఆడేసింది...! మరి టెస్టు సమరంలో కోహ్లి సేన ముందు నిలుస్తుందా? అసలు ఎంతవరకు పోటీనిస్తుందో?  


సాక్షి క్రీడా విభాగం
మూడు దశాబ్దాల క్రితం అరివీర వెస్టిండీస్‌ విదేశీ పర్యటనకు వెళ్లిందంటే టెస్టు సిరీస్‌ విజయంతోనే తిరుగు పయనమయ్యేది. రెండు దశాబ్దాల క్రితం భీకర పేస్‌తో, బ్రియాన్‌ లారా బ్యాటింగ్‌ మెరుపులతో ఆ జట్టు గెలుపు అవకాశాలు సగంసగం అయినా ఉండేవి. ఈ దశాబ్దంలో మాత్రం అటు బ్యాటింగ్‌లో మొనగాళ్లు లేక, ఇటు పసలేని పేస్‌తో ఓడకుండా కనీసం ‘డ్రా’ చేసుకుంటే అదే పదివేలు అనే పరిస్థితి.

జట్టులో ఎవరుంటారో తెలియని అనిశ్చితి, బోర్డుతో ఎప్పుడు ఏ గొడవ తలెత్తుతుందో ఊహించలేని వైచిత్రి మధ్య కరీబియన్‌ క్రికెట్‌ నామమాత్రంగా మారుతోంది. అయితే, నాణ్యమైన ఆటగాళ్ల కారణంగా పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో అంతోఇంతో పోటీ ఇస్తోంది. కానీ, సంప్రదాయ టెస్టుల్లో ఐదు రోజులూ నిలిచేంత సామర్థ్యం ప్రస్తుత జట్టుకు లేదనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై విరుచుకుపడే టీమిండియాను నిలువరించడం జాసన్‌ హోల్డర్‌ నేతృత్వంలోని వెస్టిండీస్‌కు కఠిన పరీక్షే.

నడిపిస్తున్నది ఆ నలుగురే...
జట్టుగా 11 మంది ఉన్నా వెస్టిండీస్‌ ఎక్కువగా ఆధారపడుతున్నది క్రెయిగ్‌ బ్రాత్‌వైట్, కీరన్‌ పావెల్, జాసన్‌ హోల్డర్, రోస్టన్‌ ఛేజ్‌లపైనే. ఎక్కువ శాతం వీరి రాణింపుతోనే టెస్టుల్లో ఆ మాత్రమైనా నిలుస్తోంది. కొంతలో కొంత షై హోప్, వికెట్‌ కీపర్‌ షేన్‌ డౌరిచ్‌ ఆదుకుంటున్నారు. మిగతావారంతా దాదాపు కొత్తవారే. పేస్‌ విభాగంలో అయితే కీమర్‌ రోచ్‌ మినహా చెప్పుకోదగ్గ ఆటగాడే లేడు. మరోవైపు జట్టులో కెప్టెన్‌ హోల్డర్‌ సహా ఏ ఒక్కరికీ 50 టెస్టులు ఆడిన అనుభవం కూడా లేకపోవడం గమనార్హం.

ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ అత్యధికంగా 49 టెస్టులు ఆడగా, 48 టెస్టుల్లో ప్రాతినిధ్యంతో రోచ్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రెండు మూడేళ్లుగా సారథిగా వ్యవహరిస్తున్న హోల్డర్‌ ఆడింది 34 టెస్టులే కావడం జట్టు పరిస్థితి ఏమిటనేది చెబుతోంది. బ్రాత్‌వైట్, హోప్, ఛేజ్‌లను మినహాయిస్తే బ్యాటింగ్‌లో నికరంగా నిలిచే ఆటగాడు మరొకరు లేరు. ఓ దశలో ఆటగాడిగానూ తుది జట్టులో చోటుకు హోల్డర్‌ అనర్హుడన్న వ్యాఖ్యలు వచ్చాయి. కానీ, బోర్డుతో వివాదాల కారణంగా కీలకమైన వారంతా దూరం కావడంతో ఏకంగా అతడు కెప్టెన్‌ అయ్యాడు.

అయితే, ఇటీవల లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో వికెట్లు పడగొడుతూ హోల్డర్‌ ఉనికిని చాటుకుంటున్నాడు. విమర్శలకు జవాబిస్తున్నాడు. కెప్టెన్‌గా మాత్రం అతడి వనరులు పరిమితం. స్పిన్‌కు సహకరించే భారత్‌ పిచ్‌లపై దేవేంద్ర బిషూ వంటి ద్వితీయ శ్రేణి, ఛేజ్‌ వంటి పార్ట్‌టైమ్‌  స్పిన్నర్లను నమ్ముకోవాల్సి రావడమే ఇందుకు ఉదాహరణ. పేస్‌ విభాగంలోనూ రోచ్‌ ఒక్కడే ఆధారపడదగినవాడు. షానన్‌ గాబ్రియేల్‌ కొంత అనుభవం ఉన్నా అతడి నుంచి మెరుపు ప్రదర్శనలు ఎక్కువగా ఆశించలేం.

ఏమేరకు రాణిస్తుందో?
2000 సంవత్సరం నుంచి వెస్టిండీస్‌ టెస్టు రికార్డు దారుణంగా ఉంది. ఈ పద్దెనిమిదేళ్లలో భారత్‌తో ఇంటా బయటా ఏడు సిరీస్‌ల్లో తలపడింది. 2001–02లో మాత్రమే అదీ సొంతగడ్డపై 2–1తో నెగ్గింది. తర్వాతి ఆరు సిరీస్‌లను ఒక్క విజయం లేకుండానే కోల్పోయింది. చివరిసారిగా రెండేళ్ల క్రితం తమ దగ్గరే జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 0–2తో ఓడింది. ఇందులో ఒకటి ఇన్నింగ్స్‌ ఓటమి కాగా మరోదాంట్లో ఏకంగా 237 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒక్క టెస్టును మాత్రమే డ్రా చేసుకుంది. ఈసారి కూడా గొప్పగా రాణించే అవకాశాలు కనిపించడం లేదు. దీనిప్రకారం చూస్తే భారత్‌పై టెస్టు విజయానికి 17 ఏళ్లుగా సాగుతున్న వారి నిరీక్షణ మరికొంత కాలం కొనసాగడం ఖాయం.

కొసమెరుపు: రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టి20ల పూర్తి స్థాయి సిరీస్‌కు ఎంతోముందుగానే భారత్‌ వచ్చేందుకు విండీస్‌ సిద్ధమైంది. ఈ మేరకు సెప్టెంబరు 10నే భారత్‌ చేరుకోవాల్సి ఉంది. ఏ కారణంగానో అది రెండు వారాలపైగా ఆలస్యమైంది. గత బుధవారం జట్టు ఇక్కడకు వచ్చింది. అంతేకాక, సిరీస్‌ సన్నాహకంగా తాము దుబాయ్‌లోని ఐసీసీ గ్లోబల్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ చేసుకుంటామని, సహకరించాలని బీసీసీఐని కోరింది. కానీ, మన బోర్డు వారి వినతిని అసలు పట్టించుకున్నట్లు లేదు. దేశవాళీ సీజన్‌తో బిజీగా ఉన్నామని, మీకు వసతులు కల్పించలేమంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది. దీంతో విండీస్‌ చేసేదేమీ లేకపోయింది. బోర్డు ఎలెవెన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌తోనే సరిపెట్టుకుంది. ఇందులో వారి ప్రధాన బ్యాట్స్‌మెన్‌ రాణించడం, కొత్త కుర్రాడు సునీల్‌ ఆంబ్రిస్‌ శతకం చేయడం కొంత ఊరట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement