‘సమం’ కోసం సమరం | India and England are the fourth Test from today | Sakshi
Sakshi News home page

‘సమం’ కోసం సమరం

Aug 30 2018 12:59 AM | Updated on Aug 30 2018 4:55 AM

India and England are the fourth Test from today - Sakshi

సౌతాంప్టన్‌: టెస్టు సిరీస్‌లో 0–2తో వెనుకబడి ఆత్మవిశ్వాసం కోల్పోయిన దశలో మూడో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత్‌ అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. నేటి (గురువారం) నుంచి ఇక్కడి రోజ్‌ బౌల్‌ స్టేడియంలో జరిగే నాలుగో టెస్టులో సత్తా చాటేందుకు భారత్, ఇంగ్లండ్‌ జట్లు సన్నద్ధమయ్యాయి. పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తున్నా... తొలి సెషన్‌లో గట్టిగా నిలబడగలిగితే ముందుగా బ్యాటింగ్‌ చేయడమే సరైన నిర్ణయం. తర్వాతి రోజుల్లో స్పిన్‌ ప్రభావం చూపించవచ్చు.  

మార్పుల్లేకుండా... 
కోహ్లి కెప్టెన్‌గా వ్యవహిరించిన 38 టెస్టుల్లో భారత్‌ ప్రతీ మ్యాచ్‌కు కనీసం ఒక మార్పుతోనైనా బరిలోకి దిగింది. అయితే ఈ సారి దీనికి బ్రేక్‌ పడవచ్చని కెప్టెన్‌ పరోక్షంగా చెప్పాడు. మూడో టెస్టులో ప్రతీ ఆటగాడు తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడంతో మార్పులకు అవకాశం కనిపించడం లేదు. అశ్విన్‌ ఫిట్‌నెస్‌పై కాస్త సందేహాలు ఉన్నా... ఇబ్బందేమీ లేదని కోహ్లి స్పష్టం చేశాడు. కోహ్లి చెలరేగిపోతుండగా... రహానే, పుజారా కూడా ఫామ్‌లోకి వచ్చారు. ఓపెనర్లు ధావన్, రాహుల్‌లతో పాటు పాండ్యా కీలక పాత్ర పోషించనున్నాడు. తుది జట్టులో ఇషాంత్, బుమ్రా ఖాయం కాగా... మ్యాచ్‌ ఉదయం పిచ్‌ పరిస్థితిని బట్టి రెండో స్పిన్నర్‌కు అవకాశం ఉంటే షమీ స్థానంలో జడేజా జట్టులోకి వస్తాడు. కొత్తగా ఎంపికైన విహారి, పృథ్వీ షా తమ అవకాశం కోసం మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.  

అలీ, కరన్‌కు చోటు... 
మరో వైపు గత టెస్టులో అనూహ్య షాక్‌కు గురైన ఇంగ్లండ్‌ తమ తప్పులు దిద్దుకునే పనిలో పడింది. ఈ మ్యాచ్‌ కోసం తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌ రెండు కీలక మార్పులు చేసింది. అన్‌ఫిట్‌గా ఉన్న క్రిస్‌ వోక్స్‌ స్థానంలో లెఫ్టార్మ్‌ పేసర్‌ స్యామ్‌ కరన్‌ను ఎంచుకోగా... మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ పోప్‌కు బదులుగా ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీని జట్టులోకి తీసుకుంది. గాయం కారణంగా స్టోక్స్‌ బౌలింగ్‌ చేయడంపై సందేహాలు ఉండటంతో అలీ కీలకమవుతాడని రూట్‌ చెప్పాడు. రషీద్‌ కూడా ఉండటంతో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఖాయమయ్యారు. కౌంటీల్లో డబుల్‌ సెంచరీతో అలీ బ్యాటింగ్‌లో తన సత్తాను ప్రదర్శించి జట్టులోకి వచ్చాడు. అయితే ఘోరంగా విఫలమవుతున్న ఓపెనర్లు కుక్, జెన్నింగ్స్‌లకు ఇంగ్లండ్‌ మరో అవకాశం ఇచ్చింది. 2014లో ఇదే మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 266 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.  

►మ.గం.3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లలో ప్రత్యక్ష ప్రసారం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement