ధర్మశాల: ఊహించినట్లే జరిగింది... భారత్, దక్షిణాఫ్రికా పోరుకు వరుణుడు సహకరించలేదు. గురువారం ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పీసీఏ) స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్‌లో ఒక్క బంతి కాదు కదా కనీసం టాస్ వేసే అవకాశం కూడా లేకుండానే ఆట ముగిసిపోయింది. ఉదయంనుంచి నిరంతరాయంగా కురిసిన వాన ఏ దశలోనూ తెరిపినివ్వలేదు. కనీసం వర్షం ఆగితే పిచ్‌ను పరిశీలించాలని అంపైర్లు భావించగా...అదీ సాధ్యం కాలేదు. నిర్ణీత సమయంకంటే అదనంగా దాదాపు నాలుగు గంటల పాటు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
ధర్మశాల అభిమానులకు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తీవ్ర నిరాశ ఎదురైంది. గత సెప్టెంబరులో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడే భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగాల్సింది. అప్పుడు కూడా భారీ వర్షంతో మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు కూడా అదే పునరావృతం కావడంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం లక్నోలో జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఎలాగూ ఈ మ్యాచ్‌ను అభిమానులు ప్రత్యక్షంగా చూసే అవకాశమే లేదు.
Comments
Please login to add a commentAdd a comment