న్యూఢిల్లీ: స్టార్లు లేకున్నా తమ రిజర్వ్ బెంచీ కూడా ఎంత బలమైందో భారత జట్టు మరోసారి నిరూపించింది. దక్షిణాఫ్రికాతో గత రెండు వన్డేల్లో హోరాహోరీగా తలపడిన అనంతరం చివరి పోరులో ప్రత్యర్థిపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చలాయించింది. బౌలర్ల జోరుతో సఫారీని వంద పరుగుల లోపే కట్టిపడేసి ఇరవై ఓవర్ల లోపే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకుంది.
మంగళవారం జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. భారత్‌పై సఫారీ టీమ్‌కు వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోరు. హెన్రిచ్ క్లాసెన్ (42 బంతుల్లో 34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, మరో ఇద్దరు మలాన్ (15), జాన్సెన్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ (4/18) లోయర్ ఆర్డర్‌ను పడగొట్టగా... సుందర్, సిరాజ్, షహబాజ్ తలా 2 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 105 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శుబ్‌మన్ గిల్ (57 బంతుల్లో 49; 8 ఫోర్లు) రాణించగా, శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. భారత్‌కు ఇది వరుసగా ఐదో వన్డే సిరీస్ విజయం. 3 మ్యాచ్‌లలో 20.80 సగటుతో 5 వికెట్లు తీసిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
టపటపా...
టి20 సిరీస్‌తో పాటు తొలి రెండు వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనే కనబర్చిన దక్షిణాఫ్రికా పర్యటనలో ఆఖరి పోరుకు వచ్చేసరికి పూర్తిగా చతికిలపడింది. ముగ్గురు స్పిన్నర్లతో పాటు భారత బౌలింగ్ ముందు జట్టు బ్యాటర్లు తేలిపోయారు. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన తర్వాత కోలుకోలేకపోయిన దక్షిణాఫ్రికా 33 పరుగుల వ్యవధిలో కేవలం 50 బంతుల్లోనే తమ చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. స్పిన్నర్ సుందర్‌తో బౌలింగ్ ప్రారంభించిన భారత్ మూడో ఓవర్లోనే ఫలితం సాధించింది.
డికాక్ (6)ను సుందర్ అవుట్ చేయగా, బౌన్సర్లతో చెలరేగిన సిరాజ్... మరో ఇద్దరు కీలక బ్యాటర్లు మలాన్, హెన్‌డ్రిక్స్‌లను పెవిలియన్ పంపించాడు. దాంతో తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 26 పరుగులకే పరిమితమైంది. ఆపై మరింత చెలరేగిన ముగ్గురు స్పిన్నర్లు తర్వాతి 7 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. వారి జోరుకు సఫారీ బ్యాటర్ల వద్ద ఎలాంటి సమాధానం లేకపోయింది. కుల్దీప్ ధాటికి చివరి వరుస ఆటగాళ్లు చేతులెత్తేయడంతో స్కోరు 100 పరుగులకు కూడా చేరలేకపోయింది.
రాణించిన గిల్...
ఛేదనలో భారత్ వేగంగా పరుగులు సాధించింది. అయితే ఒక ఎండ్‌లో గిల్ ధాటిగా ఆడగా, ధావన్ (8) వైఫల్యం మాత్రం కొనసాగింది. తొలి వికెట్‌కు వీరిద్దరు 37 బంతుల్లోనే 42 పరుగులు జోడించగా, గిల్ ఒక్కడే 30 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో చెలరేగిన ఇషాన్ కిషన్ (10) ఈసారి ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో గిల్, శ్రేయస్ అలవోకగా పరుగులు సాధిస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. గెలుపునకు 3 పరుగుల దూరంలో అవుటై గిల్ అర్ధ సెంచరీ చేజార్చుకోగా... జాన్సెన్ బౌలింగ్‌లో నేరుగా సిక్స్ కొట్టి శ్రేయస్ మ్యాచ్‌ను ముగించాడు. 3 మ్యాచ్‌లలో 191 పరుగులతో శ్రేయస్ ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మలాన్ (సి) అవేశ్ (బి) సిరాజ్ 15; డికాక్ (సి) అవేశ్ (బి) సుందర్ 6; హెన్‌డ్రిక్స్ (సి) (సబ్) రవి బిష్ణోయ్ (బి) సిరాజ్ 3; మార్క్‌రమ్ (సి) సామ్సన్ (బి) షహబాజ్ 9; క్లాసెన్ (బి) షహబాజ్ 34; మిల్లర్ (బి) సుందర్ 7; ఫెలుక్‌వాయో (బి) కుల్దీప్ 5; జాన్సెన్ (సి) అవేశ్ (బి) కుల్దీప్ 14; ఫార్చ్యూన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; నోర్జే (బి) కుల్దీప్ 0; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (27.1 ఓవర్లలో ఆలౌట్) 99. వికెట్ల పతనం: 1–7, 2–25, 3–26, 4–43, 5–66, 6–71, 7–93, 8–94, 9–94, 10–99. బౌలింగ్: సుందర్ 4–0–15–2, సిరాజ్ 5–0–17–2, అవేశ్ 5–1–8–0, షహబాజ్ 7–0– 32–2, శార్దుల్ 2–0–8–0, కుల్దీప్ 4.1–1 –18–4.
భారత్ ఇన్నింగ్స్: ధావన్ (రనౌట్) 8; గిల్ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 49; ఇషాన్ కిషన్ (సి) డికాక్ (బి) ఫార్చ్యూన్ 10; అయ్యర్ (నాటౌట్) 28; సామ్సన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 105.
వికెట్ల పతనం: 1–42, 2–58, 3–97. బౌలింగ్: జాన్సెన్ 5.1–0–43–0, ఇన్‌గిడి 5–0–21–1, నోర్జే 5–1–15–0, ఫార్చ్యూన్ 4–1–20–1.
Comments
Please login to add a commentAdd a comment