మనీలా: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. మంగళవారం గ్రూప్ ‘బి’లో కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–1తో ఘనవిజయం సాధించింది. ముందుగా జరిగిన మూడు సింగిల్స్ పోటీల్లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, శుభాంకర్ డే విజయం సాధించారు. తొలి డబుల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్–చిరాగ్ శెట్టి జోడీ కంగుతినగా, రెండో డబుల్స్‌లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల ద్వయం గెలుపొందింది. ఈ విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్ బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ కేవలం 23 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించాడు.
శ్రీకాంత్ 21–10, 21–7తో డిమిత్రి పనరిన్‌పై అలవోక విజయం సాధించాడు. లక్ష్యసేన్ కూడా 21 నిమిషాల్లో ఆట ముగించాడు. అతను 21–13, 21–8తో అర్తుర నియజోవ్‌పై నెగ్గగా... శుభాంకర్ డే 21–11, 21–5తో కైత్‌మురత్ కుల్మతోవ్‌పై గెలిచేందుకు 26 నిమిషాలే పట్టింది. డబుల్స్‌లో ప్రణయ్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 16–21, 19–21తో నియజోవ్–పనరిన్ జంట చేతిలో ఓడింది. మరో డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల ద్వయం 21–14, 21–8తో నికిట బ్రగిన్–కైత్‌మురత్ జోడీపై వరుస గేముల్లో గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ మంగళవారం బరిలోకి దిగలేదు. గురువారం జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు క్వార్టర్స్ చేరతాయి.
Comments
Please login to add a commentAdd a comment