షమీ శత్రు వినాశిని... | India Beat South Africa In First Test Match By 203 Runs | Sakshi
Sakshi News home page

షమీ శత్రు వినాశిని...

Published Mon, Oct 7 2019 3:51 AM | Last Updated on Mon, Oct 7 2019 5:26 AM

India Beat South Africa In First Test Match By 203 Runs - Sakshi

భారత్‌ ఖాతాలో మరో అద్భుత విజయం చేరింది. గెలుపు కోసం చివరి రోజు 98 ఓవర్లలో 9 వికెట్లు తీయాల్సిన స్థితిలో మైదానంలోకి దిగిన టీమిండియా 54.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికాకు కష్టం తప్పదని తెలిసినా... అనూహ్యంగా షమీ రూపంలో దూసుకొచి్చన పేస్‌ ముందు  ఆ జట్టు నిలబడలేకపోయింది. పదునైన బంతులతో చెలరేగిన షమీకి జడేజా అండగా నిలవడంతో తొందరగా పని ముగిసింది.

వీరిద్దరి ధాటికి ఒక దశలో  70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సఫారీలు తొలి సెషన్‌కే ఆట ముగించేలా కనిపించారు. అయితే పీట్, ముత్తుసామి అనూహ్య ప్రతిఘటనతో తొమ్మిదో వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో మన గెలుపు ఆలస్యమైంది. విశాఖ టెస్టు    విజయంతో 40 పాయింట్లు సాధించిన భారత్‌... వరల్డ్‌ చాంపియన్‌íÙప్‌లో 160 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో కొనసాగుతోంది.  

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సొంతగడ్డపై టెస్టు సీజన్‌ను భారత్‌ ఘనంగా ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టును గెలుచుకొని 1–0తో ఆధిక్యంలో నిలిచింది. వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 203 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 11/1తో ఐదో రోజు ఆట కొనసాగించిన సఫారీలు తమ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు.

డేన్‌ పీట్‌ (107 బంతుల్లో 56; 9 ఫోర్లు 1 సిక్స్‌), సేనురన్‌ ముత్తుసామి (108 బంతుల్లో 49 నాటౌట్‌; 5 ఫోర్లు)లతో పాటు మార్క్‌రమ్‌ (74 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కొంత వరకు పోరాడగలిగారు. షమీ 35 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 4 వికెట్లు, అశ్విన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి పుణేలో జరుగుతుంది.  

టపటపా...
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆటను చూస్తే చివరి రోజు కొంతైనా ఆ జట్టు పోరాడగలదని అనిపించింది. కానీ అసలు బంతిని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకోలేక ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ వరుస కట్టి పెవిలియన్‌ చేరారు. కేవలం 16.1 ఓవర్ల వ్యవధిలో ఆ జట్టు ఏకంగా 7 వికెట్లు చేజార్చుకుంది. ఆదివారం రెండో ఓవర్లో బ్రూయిన్‌ (10)ను బౌల్డ్‌ చేసి అశి్వన్‌ ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. ఇది అశి్వన్‌కు టెస్టుల్లో 350వ వికెట్‌ కావడం విశేషం. ఆ తర్వాత షమీ మెరుపు బౌలింగ్‌తో తర్వాతి మూడు వికెట్లు కుప్పకూలాయి. కొద్ది సేపటికే జడేజా వేసిన ఒక ఓవర్‌ మ్యాచ్‌ను భారత్‌ చేతుల్లోకి తెచ్చేసింది. క్రీజ్‌లో పట్టుదలగా పాతుకుపోయిన మార్క్‌రమ్‌ను చక్కటి బంతితో బోల్తా కొట్టించిన జడేజా... అదే ఓవర్లో ఫిలాండర్‌ (0), కేశవ్‌ మహరాజ్‌ (0)లను పెవిలియన్‌ పంపించాడు. ఇక సఫారీల ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సేపు పట్టదనిపించింది. 

పోరాడిన ద్వయం...
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 7 సెంచరీలు చేసిన రికార్డు ఉన్న ముత్తుసామి, ఒక సెంచరీ సాధించిన పీట్‌ కలిసి సఫారీ తరఫున పోరాడే ప్రయత్నం చేశారు. బలమైన డిఫెన్స్‌తో వీరిద్దరు చెరో 100కు పైగా బంతులు ఆడారు. ఈ క్రమంలో కొన్ని చక్కటి షాట్లతో పరుగులు కూడా రాబట్టారు. జడేజా ఓవర్లో పీట్‌ వరుస బంతుల్లో 4, 6 కొట్టాడు. నిర్ధారిత లంచ్‌ సమయం గడచిపోయినా... ఆలౌట్‌ చేయడం కోసం భారత్‌ అదనంగా మరో 15 నిమిషాల సమయం కోరింది. ఆ ఐదు ఓవర్లలో కూడా వికెట్‌ దక్కలేదు. విరామం తర్వాత కూడా వీరిద్దరు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొని చకచకా పరుగులు సాధించారు. ఈ క్రమంలో 86 బంతుల్లో పీట్‌ అర్ధ సెంచరీ పూర్తయింది.  ప్రమాదకరంగా మారిన ఈ భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు షమీ విడదీశాడు. ఈ సెషన్‌లో బౌలింగ్‌కు వచ్చీ రాగానే తొలి బంతికే పీట్‌ను అవుట్‌ చేసిన అతను, కొద్ది సేపటికే రబడ వికెట్‌ కూడా తీయడంతో భారత జట్టు సంబరాల్లో మునిగింది.  

‘మ్యాజిక్‌ బౌలింగ్‌’...
షమీ కెరీర్‌లో తొలి ఇన్నింగ్స్‌ బౌలింగ్‌ సగటు 34.47 కాగా రెండో ఇన్నింగ్స్‌లో సగటు 22.58 మాత్రమే! రెండో ఇన్నింగ్స్‌లో అతను ఎంతగా చెలరేగిపోతాడో ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అతని టాప్‌–6 ప్రదర్శనల్లో 5 రెండో ఇన్నింగ్స్‌లోనే వచ్చాయి. ఇప్పుడు వైజాగ్‌లో కూడా అదే జోరు కనిపించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ తీయలేకపోయిన షమీ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. ముఖ్యంగా అతను తీసిన తొలి మూడు వికెట్లు అద్భుతమని చెప్పవచ్చు.

అమిత వేగంతో దూసుకొచి్చన బంతిని బవుమా గుర్తించే లోపే వికెట్లను గిరాటేయగా... షమీ బంతిని తప్పుగా అంచనా వేసిన డు ప్లెసిస్‌ బ్యాట్‌ ఎత్తేసి ఫలితం అనుభవించాడు. మరో చక్కటి బంతి డి కాక్‌ స్టంప్స్‌ను పడేసింది. చివరకు స్పిన్నర్లతో వికెట్‌ దక్కని వేళ నేనున్నానంటూ మళ్లీ వచి్చన షమీ బంతిని పీట్‌ వికెట్లపైకి ఆడుకున్నాడు. ఈ నాలుగు వికెట్లు బౌల్డ్‌ కాగా, కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి రబడ వెనుదిరగడంతో షమీ ఖాతాలో ఐదు వికెట్ల ఘనత చేరింది. 

►5షమీ టెస్టు ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం ఇది ఐదోసారి.

►5 తొలి ఇన్నింగ్స్‌లో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాక కూడా దక్షిణాఫ్రికా ఓడిపోవడం ఇది ఐదోసారి.  

►23స్వదేశంలో భారత పేస్‌ బౌలర్‌ 23 ఏళ్ల తర్వాత నాలుగో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. చివరిసారి భారత్‌ తరఫున జవగళ్‌ శ్రీనాథ్‌ 1996లో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత నమోదు చేశాడు. షమీ, శ్రీనాథ్‌ కాకుండా కపిల్‌ దేవ్, కర్సన్‌ ఘావ్రీ, మదన్‌లాల్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.  

►66  టెస్టుల్లో 350 వికెట్లు పడగొట్టేందుకు అశ్విన్‌కు పట్టిన టెస్టులు. అతి తక్కువ టెస్టుల్లో ఈ ఘనత సాధించిన ముత్తయ్య మురళీధరన్‌ (66) రికార్డును అశి్వన్‌ సమం చేయడం విశేషం. భారత బౌలర్లలో ఈ మైలురాయిని చేరేందుకు కుంబ్లేకు 77, హర్భజన్‌కు 83, కపిల్‌దేవ్‌కు 100 టెస్టులు పట్టాయి.  

►37 ఈ టెస్టులో నమోదైన మొత్తం సిక్సర్లు. ఒక మ్యాచ్‌లో కొట్టిన అత్యధిక సిక్సర్లుగా కొత్త రికార్డు నమోదైంది. 2014లో పాక్‌–కివీస్‌ మ్యాచ్‌లో 35 సిక్సర్లు వచ్చాయి.  

►4 అరంగేట్రం టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌లలో 30 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి అజేయంగా నిలిచిన నాలుగో క్రికెటర్‌గా సేనురన్‌ ముత్తుసామి గుర్తింపు పొందాడు. గతంలో అల్బర్ట్‌ ట్రాట్‌ (ఆ్రస్టేలియా–1895లో ఇంగ్లండ్‌పై), జార్జి గ్రాంట్‌ (వెస్టిండీస్‌–1930లో ఆ్రస్టేలియాపై), అజహర్‌ మెహమూద్‌ (పాకిస్తాన్‌–1997లో దక్షిణాఫ్రికాపై) ఈ ఘనత సాధించారు.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 502/7 డిక్లేర్డ్‌; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 431 ఆలౌట్‌; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 323/4 డిక్లేర్డ్‌;  దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి అండ్‌ బి) జడేజా 39; ఎల్గర్‌ (ఎల్బీ) (బి) జడేజా 2; బ్రూయిన్‌ (బి) అశి్వన్‌ 10; బవుమా (బి) షమీ 0; డు ప్లెసిస్‌ (బి) షమీ 13; డి కాక్‌ (బి) షమీ 0; ముత్తుసామి (నాటౌట్‌) 49; ఫిలాండర్‌ (ఎల్బీ) (బి) జడేజా 0; కేశవ్‌ మహరాజ్‌ (ఎల్బీ) (బి) జడేజా 0; పీట్‌ (బి) షమీ 56; రబడ (సి) సాహా (బి) షమీ 18; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (63.5 ఓవర్లలో ఆలౌట్‌) 191.  
వికెట్ల పతనం: 1–4, 2–19, 3–20, 4–52, 5–60, 6–70, 7–70, 8–70, 9–161, 10–191. బౌలింగ్‌: అశి్వన్‌ 20–5–44–1, జడేజా 25–6–87–4, షమీ 10.5–2–35–5, ఇషాంత్‌ 7–2–18–0, రోహిత్‌ 1–0–3–0.

►మ్యాచ్‌లో తొలి మూడు రోజులు వికెట్‌ చక్కగా స్పందించింది. వర్షంతో ఒక సెషన్‌ కోల్పోవడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందని తెలుసు. అయితే ఒకసారి 500కు పైగా పరుగులు చేసిన తర్వాత ప్రత్యరి్థకి అంతా కష్టంగా మారిపోతుంది. మయాంక్, రోహిత్‌ చాలా బాగా ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా కూడా దూకుడు కనబర్చాడు. వాతావరణం, పిచ్‌ నెమ్మదించడం కారణంగా ఈ పరుగులేవీ సులువుగా రాలేదనేది నా అభిప్రాయం.

ఇదంతా మన దృక్పథానికి సంబంధించింది. స్పిన్నర్లే పని పూర్తి చేస్తారని ఫాస్ట్‌ బౌలర్లు గనక భావిస్తే అది తప్పు. కానీ మన ఫాస్ట్‌బౌలర్లు స్వదేశంలో కూడా బాగా రాణిస్తున్నారు. వారు చిన్న స్పెల్‌లే వేసినా అవి జట్టుకు ఉపయోగపడుతున్నాయి. జడేజా, అశ్విన్‌ చెరో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అయితే చాలా రోజులుగా రెండో ఇన్నింగ్స్‌లో షమీ నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ చేసి చూపించాడు.
– కోహ్లి, భారత కెపె్టన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement