సఫారీల పోరాటం | India vs South Africa 1st Test Match At Visakhapatnam Day 3 | Sakshi
Sakshi News home page

సఫారీల పోరాటం

Published Sat, Oct 5 2019 3:41 AM | Last Updated on Sat, Oct 5 2019 5:27 AM

India vs South Africa 1st Test Match At Visakhapatnam Day 3  - Sakshi

దక్షిణాఫ్రికా తేలిగ్గా తలవంచలేదు. ముందు రోజే మూడు వికెట్లు కోల్పోయినా పట్టుదలగా నిలబడిన బ్యాట్స్‌మెన్‌ భారత బౌలింగ్‌ను నిరోధించారు. ఎల్గర్, డి కాక్‌ సెంచరీలతో సత్తా చాటి తమ జట్టును తక్షణ ప్రమాదం నుంచి తప్పించారు. వీరితో పాటు కెపె్టన్‌ డు ప్లెసిస్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడగా... సఫారీ జట్టు ఆలౌట్‌ కాకుండా రోజంతా నిలబడింది. ఆధిక్యానికి అవకాశం లేకపోయినా తొలిఇన్నింగ్స్‌ స్కోరు అంతరాన్ని మాత్రం బాగా తగ్గించింది.

పేసర్లు పెద్దగా ప్రభావం చూపని చోట ఎప్పటిలాగే సొంతగడ్డపై నమ్ముకున్న స్పిన్నర్లే టీమిండియాను నడిపించారు. అశి్వన్‌ మరోసారి ఐదు వికెట్లతో మెరవడం, జడేజా 200 వికెట్ల మైలురాయిని చేరుకోవడం భారత కోణంలో శుక్రవారం ఆటలో చెప్పుకోదగ్గ విశేషాలు. అనూహ్య బౌన్స్‌తో పిచ్‌ ఇప్పటికే భిన్నంగా స్పందించడం మొదలైన నేపథ్యంలో నాలుగో రోజు సఫారీలు మరెన్ని పరుగులు జోడిస్తారో, ఆ తర్వాత భారత్‌ ఎలా ఆడుతుందో అనేది ఆసక్తికరం.

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు గట్టి పోరాటపటిమ ప్రదర్శించింది. శుక్రవారం 98 ఓవర్లు ఆడినా కేవలం 5 వికెట్లు మాత్రమే చేజార్చుకొని మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (287 బంతుల్లో 160; 18 ఫోర్లు, 4 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డి కాక్‌ (163 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించగా... కెపె్టన్‌ డు ప్లెసిస్‌ (103 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఎల్గర్‌ ఐదో వికెట్‌కు ప్లెసిస్‌తో 115 పరుగులు, ఆరో వికెట్‌కు డి కాక్‌తో 164 పరుగులు జోడించాడు. ఒకే రోజు దక్షిణాఫ్రికా 346 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్‌ 5 వికెట్లు పడగొట్టగా, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 117 పరుగులు వెనుకబడి ఉంది.

తొలి సెషన్‌: తడబడి... నిలబడి...
ఓవర్‌నైట్‌ స్కోరు 39/3 నుంచి తడబడుతూనే దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ కొనసాగించింది. ఆట మొదలైన కొద్దిసేపటికి బవుమా (18)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఇషాంత్‌ మూడో రోజు మొదటి దెబ్బ వేశాడు. కానీ మొదటి సెషన్‌ ముగిసేసరికి ఆ ఆనందం భారత ఆటగాళ్ల నుంచి దూరమైంది. ఎల్గర్, డు ప్లెసిస్‌ కలిసి ప్రశాంతంగా, చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేశారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోవడం కూడా వారికి కలిసొచి్చంది. ఐదు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టి ప్లెసిస్‌ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. వేగంగా ఆడిన ఈ జోడీని విడగొట్టడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. 

ఓవర్లు: 30, పరుగులు: 114, వికెట్లు: 1

రెండో సెషన్‌:  డి కాక్‌ దూకుడు
లంచ్‌ తర్వాత కొద్ది సేపటికే 91 బంతుల్లో డు ప్లెసిస్‌ అర్ధసెంచరీ పూర్తవడంతో పాటు ఎల్గర్‌తో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. భారత శిబిరంలో అసహనం పెరిగిపోతున్న దశలో ఎట్టకేలకు అశి్వన్‌ బ్రేక్‌ ఇచ్చాడు. వ్యూహాత్మకంగా లెగ్‌ స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచి బంతిని వేయగా డు ప్లెసిస్‌ నేరుగా అక్కడే ఉన్న పుజారా చేతుల్లోకి కొట్టాడు. అయితే తర్వాత వచ్చిన డి కాక్‌ కూడా ఎల్గర్‌కు చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా కీపర్‌ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. అశి్వన్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను, జడేజా వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4 బాదడం విశేషం. భాగస్వామ్యాన్ని పడగొట్టే ప్రయత్నంలో విహారి, రోహిత్‌లతో బౌలింగ్‌ వేయించినా లాభం లేకపోయింది. అశి్వన్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 79  బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్న డి కాక్‌... విహారి వేసిన తర్వాతి ఓవర్లోనూ మరో రెండు బౌండరీలు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు. టీ విరామానికి అర గంట ముందే చీకటిగా మారడంతో ఫ్లడ్‌లైట్లలో మ్యాచ్‌ను కొనసాగించారు. అందుకే భారత్‌ కొత్త బంతిని తీసుకున్నా అంపైర్ల సూచన మేరకు వెంటనే పేసర్లతో బౌలింగ్‌ చేయించలేదు. 

ఓవర్లు: 37, పరుగులు: 139, వికెట్లు: 1

 మూడో సెషన్‌: అశ్విన్‌ మెరిసె...
విరామం తర్వాత కూడా ఎల్గర్, డి కాక్‌ల జోరు కొనసాగింది. వీరిద్దరు భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. కొత్త బంతితో ఇషాంత్, షమీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో రెండు వైపుల నుంచి అశ్విన్‌, జడేజాలే భారం మోశారు. ఎల్గర్‌ను అవుట్‌ చేసి భారత్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది.అశ్విన్‌ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 బాదిన డి కాక్‌ 149 బంతుల్లో కెరీర్‌లో ఐదో సెంచరీని సాధించాడు. అయితే డి కాక్‌ను అవుట్‌ చేసి అశ్విన్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఫిలాండర్‌ (0)ను వెనక్కి పంపి అశి్వన్‌ ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. 

ఓవర్లు: 31, పరుగులు: 93, వికెట్లు: 3

ఆ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే...
మూడో రోజు భారత జట్టు మైదానంలో బాగా తడబడింది.  రెండు క్యాచ్‌లు చేజారడం మ్యాచ్‌ గతిని మార్చేశాయి. 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో ఎల్గర్‌ ఇచి్చన క్యాచ్‌ను సాహా వదిలేశాడు. ఆ తర్వాత ఎల్గర్‌ మరో 86 పరుగులు జోడించాడు. విహారి బౌలింగ్‌లో 7 పరుగుల వద్ద డి కాక్‌ ఇచి్చన  క్యాచ్‌ను సిల్లీ పాయింట్‌లో రోహిత్‌ అందుకోవడంలో విఫలమయ్యాడు. సరైన సమయంలో కిందకు వంగడంలో రోహిత్‌ విఫలమయ్యాడు. ఇది మరో 104 పరుగులు నష్టాన్ని కలిగించింది.

ఇద్దరూ సిక్సర్లతోనే...
దక్షిణాఫ్రికా జట్టులో సెంచరీ సాధించిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ కూడా సిక్సర్లతోనే వాటిని పూర్తి చేయడం విశేషం. అశి్వన్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌తో ఎల్గర్‌ శతకం చేరగా... అశ్విన్‌ బౌలింగ్‌లోనే కవర్స్‌ మీదుగా సిక్సర్‌ బాది డి కాక్‌ ఆ మైలురాయిని అందుకున్నాడు. 2002లో పాకిస్తాన్‌పై పాంటింగ్, స్టీవ్‌ వా మాత్రమే ఇదే తరహాలో ఒకే ఇన్నింగ్స్‌లో  శతకాలు సాధించారు.  

సూపర్‌ ఇన్నింగ్స్‌...
భారత గడ్డపై ఒక విదేశీ బ్యాట్స్‌మన్‌ టెస్టుల్లో సాధికారికంగా బ్యాటింగ్‌ చేయడం చాలా అరుదు. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో గడపడం, స్పిన్నర్ల పరీక్షకు ఎదురుగా నిలవడం అంత సులువు కాదు. అయితే దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌తో జట్టు కుప్పకూలిపోకుండా కాపాడాడు. 2015లో 0–3తో చిత్తుగా ఓడిన బృందంలో ఎల్గర్‌ కూడా సభ్యుడే. ఆ సిరీస్‌లో 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 137 పరుగుల పేలవ ప్రదర్శనతో అతను వెనుదిరగ్గా... ఈ సారి తొలి ఇన్నింగ్స్‌లో అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం. ఓపెనర్‌గా వచ్చి మూడు సందర్భాల్లో చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు ఉన్న ఎల్గర్‌ అసలు సమయంలో తన సత్తాను ప్రదర్శించగలిగాడు.

క్రీజ్‌లో ఉన్నంతసేపు ఏ దశలోనూ తడబడకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో, బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ చక్కటి షాట్లు ఆడటం ఎల్గర్‌ ఇన్నింగ్స్‌లో కనిపించింది. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. మ్యాచ్‌ రెండో రోజు అవతలి ఎండ్‌లో మూడు వికెట్లు పడ్డా, ఎల్గర్‌ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపించాడు. జడేజా బౌలింగ్‌లో అతను బాదిన సిక్సరే అందుకు నిదర్శనం. శుక్రవారం రెండు సెంచరీ భాగస్వామ్యాల్లో కీలక పాత్రతో ఎల్గర్‌ జట్టును నడిపించాడు. 112 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత జడేజా వేసిన ఓవర్లో దూకుడు అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. ఈ ఓవర్లో ఎల్గర్‌ 2 భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టడం విశేషం.

షమీ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 90ల్లోకి చేరుకున్న ఎల్గర్‌కు కెరీర్‌లో 12వ సెంచరీ సాధించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. సెంచరీ తర్వాత కూడా జోరు తగ్గించని ఎల్గర్‌ మరికొన్ని షాట్లతో అలరించాడు. ఏడు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు కొట్టి 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే తన అత్యధిక స్కోరు 199ను అధిగమించి తొలి డబుల్‌ సెంచరీ మాత్రం నమోదు చేయలేకపోయాడు. జడేజా బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించగా బౌండరీ నుంచి వేగంగా దూసుకొచ్చిన పుజారా చక్కటి క్యాచ్‌ పట్టడంతో ఎల్గర్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ముగిసింది.   

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 502/7 డిక్లేర్డ్‌; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) పుజారా (బి) జడేజా 160; మార్క్‌రమ్‌ (బి) అశి్వన్‌ 5; బ్రూయిన్‌ (సి) సాహా (బి) అశి్వన్‌ 4; పీట్‌ (బి) జడేజా 0; బవుమా (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 18; డు ప్లెసిస్‌ (సి) పుజారా (బి) అశ్విన్‌ 55; డి కాక్‌ (బి) అశ్విన్‌ 111; ముత్తుసామి (బ్యాటింగ్‌) 12; ఫిలాండర్‌ (బి) అశి్వన్‌ 0; మహరాజ్‌ (బ్యాటింగ్‌) 3; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (118 ఓవర్లలో 8 వికెట్లకు) 385

వికెట్ల పతనం: 1–14, 2–31, 3–34, 4–63, 5–178, 6–342, 7–370, 8–376.

బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 14–2–44–1, షమీ 15–3–40–0, అశి్వన్‌ 41–11–128–5, జడేజా 37–4–116–2, విహారి 9–1–38–0, రోహిత్‌ 2–1–7–0.  

►200 జడేజా టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 44వ టెస్టులో ఈ ఘనత సాధించిన అతను అందరికంటే వేగంగా ఈ మైలురాయిని అందుకున్న లెఫ్టార్మ్‌ బౌలర్‌గా రంగన హెరాత్‌ (47) రికార్డును సవరించాడు. ఓవరాల్‌గా భారత బౌలర్లలో 37 టెస్టుల్లోనే 200 వికెట్లు తీసిన అశి్వన్‌ మొదటి స్థానంలో ఉన్నారు.  

►27 అశి్వన్‌ కెరీర్‌లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 27వ సారి. అతను అండర్సన్, బోథమ్‌ (27)లతో సమంగా నిలిచాడు. ఓవరాల్‌గా మరో ఆరుగురు మాత్రమే అశ్విన్‌కంటే ముందున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement