ఆఖరి పోరులో విండీస్‌పై భారత్ జయభేరి
ఆఖరి పోరులో భారత జట్టు ‘ముగ్గురు మొనగాళ్లు’ మెరిపించారు. కెప్టెన్ కోహ్లి (29 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), రాహుల్ (56 బంతుల్లో 91; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 71; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగుల దాడికి విండీస్ శిబిరం చెల్లాచెదురైంది. తొలుత లోకేశ్ రాహుల్‌ను మించిన సిక్సర్లను రోహిత్ శర్మ బాదితే... ‘హిట్‌మ్యాన్’ను తలదన్నేలా భారీ సిక్స్‌లతో కోహ్లి రెచి్చపోయాడు. భారత బౌలర్లు కూడా ఆరంభంలోనే విండీస్ వికెట్లు తీయడంతో వార్ వన్‌సైడ్ అయింది. టీమిండియా ఖాతాలో విజయంతోపాటు సిరీస్ కూడా చేరింది.
ముంబై: కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి! ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి! అనే తెలుగు పాటకు సరిగ్గా సరిపోయే విన్యాసం చేశారు భారత బ్యాట్స్‌మెన్. ఓపెనర్లు రోహిత్, రాహుల్, కెప్టెన్ కోహ్లి సిక్స్‌లు కొట్టారు... విండీస్‌తో రఫ్ఫాడారు! దీంతో రెండు సార్లు టి20 ప్రపంచ చాంపియన్ అయిన వెస్టిండీస్ కకావికలమైంది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన ఆఖరి టి20లో భారత్ 67 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడింది. పొలార్డ్ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) కాసేపు పోరాటం చేశాడు. భారత బౌలర్లు దీపక్ చాహర్, భువనేశ్వర్, షమీ, కుల్దీప్ తలా 2 వికెట్లు తీశారు. రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి.
రోహిత్ సూపర్ హిట్...
తొలి ఓవర్లోనే బౌండరీతో ఖాతా తెరిచిన రోహిత్ శర్మ... కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డీప్ వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్‌తో 400 సిక్సర్ల క్లబ్‌లో చేరాడు. ఆ ఓవర్లో మరో రెండు బౌండరీలను బాదాడు. ఆ మరుసటి ఓవర్ తన వంతు అనుకున్నాడేమో రాహుల్! 4, 6లతో మొత్తం 14 పరుగులు సాధించాడు. ఐదో ఓవర్ తొలి బంతిని ‘హిట్‌మ్యాన్’ లాంగాన్‌లోకి సిక్స్‌గా తరలించాడు. దీంతో 4.1 ఓవర్లలోనే (25 బంతుల్లో) భారత్ 50 పరుగులు పూర్తయ్యాయి. తర్వాత బంతిని సిక్స్ బాదేందుకు ప్రయత్నించగా.. డీప్ మిడ్‌వికెట్ బౌండరీ లైన్ వద్ద అప్రమత్తంగా ఉన్న లూయిస్ అసాధారణ రీతిలో అడ్డుకున్నాడు.
ఓపెనింగ్ జోరు చూసి ఇక లాభం లేదనుకొని పొలార్డ్ ఆరో ఓవర్లో విలియమ్స్‌ను రంగంలోకి దింపాడు. రాహుల్ అతనికి 4, 6, 4తో స్వాగతం పలికాడు. దీంతో పవర్‌ప్లేలో భారత్ 72/0 స్కోరు చేసింది. ఎనిమిదో ఓవర్లో రోహిత్ రెచి్చపోయాడు. పియరీ వేసిన ఆ ఓవర్‌లో చితగ్గొట్టాడు. డీప్‌స్క్వేర్ లెగ్‌లో ఒకటి, బౌలర్ తలమీది నుంచి మరొకటి ఇలా వరుస సిక్స్‌లు బాదడంతో 23 బంతుల్లోనే రోహిత్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. ఆఖరి బంతిని బౌండరీకి తరలించడంతో 8వ ఓవర్లో భారత్ స్కోరు వంద దాటింది. ఈ ఓవర్లో 21 పరుగులొచ్చాయి.
రాహుల్ జిగేల్...
గత మ్యాచ్‌లో విఫలమైన రాహుల్ సిరీస్‌ను నిర్ణయించే పోరులో బాధ్యతాయుతంగా ఆడాడు. ఒక్క లూజ్ షాట్ లేకుండా తన ఇన్నింగ్స్‌ను ఆఖరి ఓవర్‌దాకా కొనసాగించాడు. ‘హిట్‌మ్యాన్’ తర్వాత 9వ ఓవర్లో రాహుల్ కూడా 29 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ చేశాడు. తొలిసగం (10) ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 116 పరుగులు చేసింది. వాల్‡్ష వేసిన 11వ ఓవర్లో రోహిత్ బ్యాట్ నుంచి మరో సిక్స్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో పడింది. రాహుల్ మరో 2 బౌండరీలు సాధించడంతో భారత్ ఓవర్‌కు 12 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. ఓపెనర్లిద్దరి విధ్వంసకాండకు ఎట్టకేలకు విండీస్ బౌలర్ విలియమ్స్ బ్రేక్ వేశాడు. భారీ షాట్‌కు యతి్నంచిన రోహిత్...వాల్ష్ చేతికి చిక్కాడు. దీంతో 135 పరుగుల తొలి వికెట్ మెరుపు భాగస్వామ్యానికి తెరపడింది. గత మ్యాచ్‌లో శివమ్ దూబేను దించిన కోహ్లి ఈసారి రిషభ్ పంత్(0)కు ఆ అవకాశ మిచ్చాడు. కానీ అతను డకౌటై నిరాశపరిచాడు.
విండీస్ విలవిల...
కష్టసాధ్యమైన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆదిలోనే కష్టాల పాలైంది. తొలి ఓవర్లో 7 పరుగులు చేసిన విండీస్ ఆ తర్వాత ఓవర్‌కు ఓ వికెట్ చొప్పున నాలుగు ఓవర్లదాకా 3 కీలక వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్లో కింగ్ (5)ను భువనేశ్వర్, మూడో ఓవర్లో సిమన్స్ (7)ను షమీ, నాలుగో ఓవర్లో పూరన్ (0)ను చాహర్ పెవిలియన్ చేర్చారు. దాంతో విండీస్ 17 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. అనంతరం హెట్‌మైర్ (24 బంతుల్లో 41; 1 ఫోర్, 5 సిక్స్‌లు), పొలార్డ్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి చకచకా పరుగులు చేశారు.
దూబే వేసిన ఏడో ఓవర్లో హెట్‌మైర్ 6, 4 కొట్టగా, పొలార్డ్ రెండు బౌండరీలు బాదడంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెట్‌మైర్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను షమీ నేలపాలు చేశాడు. అయినప్పటికీ అతను ఎంతోసేపు క్రీజులో నిలువలేకపోయాడు. పదో ఓవర్లో కుల్దీప్ హెట్‌మైర్‌ను బోల్తా కొట్టించాడు. తర్వాత పొలార్డ్ సిక్స్‌లతో విరుచుకుపడటంతో జట్టు స్కోరు 10.4 ఓవర్లలోనే వంద పరుగులకు చేరింది. పొలార్డ్ 33 బంతుల్లో (3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. అనంతరం అతన్ని భువీ ఔట్ చేయడంతో విండీస్ ఆశలన్నీ అడుగంటాయి. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ లూయిస్ బ్యాటింగ్‌కు దిగలేదు.
విరాట్... 2.0
భారత కెప్టెన్ కోహ్లి వచ్చిరాగానే విధ్వంసం మొదలెట్టాడు. భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో విరాట్ 2.0 వర్షన్ చూపెట్టాడు. మంచుకురిసే వేళలోనూ ఫీల్డర్లను చెమటలు కక్కించాడు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో 6, 1, 4, 6, 4, 1తో ఏకంగా 22 పరుగుల్ని పిండుకున్నాడు. ఆఖర్లో పొలార్డ్‌ను తన షాట్లతో 6, 6, 3, 4, 1, 1, 6 ఊచకోత కోశాడు. విండీస్ సారథి 19వ ఓవర్ వేయగా భారత కెపె్టన్ బేస్‌బాల్ షాట్‌తో లాంగాన్‌లో సిక్స్‌గా మలిచాడు.
ఈసారి వికెట్లపై సంధించిన లెంత్‌బాల్‌ను తన మణికట్టు బలంతో మళ్లీ లాంగాన్ వైపే సిక్సర్‌గా తరలించాడు. ఈ రెండు సిక్స్‌లతో కోహ్లి 21 బంతుల్లోనే (3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. మూడో బంతి నోబాల్ కాగా, ఆ తర్వాత ఫోర్, సిక్స్‌తో మొత్తం 27 పరుగుల్ని సాధించాడు. అంతకుముందు కాట్రెల్ బౌలింగ్‌లో చెరో బౌండరీ బాదిన కోహ్లి, రాహుల్ తర్వాత విలియమ్స్ బౌలింగ్‌నూ విడిచిపెట్టలేదు. మొదట లాంగాఫ్‌లో రాహుల్ సిక్సర్ బాదగా... బంతి వ్యవధిలో కోహ్లి లాంగాన్‌లో సిక్సర్ బాదారు. దీంతో 17.4 ఓవర్లలోనే భారత్ స్కోరు 200 పరుగులకు చేరింది. చివరి ఓవర్లో రాహుల్ ని్రష్కమించినా... కోహ్లి ఆఖరి బంతికి సిక్స్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) వాల్‡్ష (బి) విలియమ్స్ 71; లోకేశ్ రాహుల్ (సి) పూరన్ (బి) కాట్రెల్ 91; రిషభ్ పంత్ (సి) హోల్డర్ (బి) పొలార్డ్ 0; కోహ్లి (నాటౌట్) 70; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 240.
వికెట్ల పతనం: 1–135, 2–138, 3–233.
బౌలింగ్: కాట్రెల్ 4–0–40–1; హోల్డర్ 4–0–54–0; క్యారీ పియరీ 2–0–35–0, కాస్రిక్ విలియమ్స్ 4–0–37–1; వాల్‡్ష 4–0–38–0; పొలార్డ్ 2–0–33–1.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమన్స్ (సి) అయ్యర్ (బి) షమీ 7; బ్రాండన్ కింగ్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 5; హెట్‌మైర్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 41; పూరన్ (సి) దూబే (బి) దీపక్ చాహర్ 0; పొలార్డ్ (సి) (సబ్) జడేజా (బి) భువనేశ్వర్ 68; హోల్డర్ (సి) (సబ్) మనీశ్ పాండే (బి) కుల్దీప్ 8; వాల్‡్ష (బి) షమీ 11; క్యారీ పియరీ (సి) (సబ్) జడేజా (బి) దీపక్ చాహర్ 6; కాస్రిక్ విలియమ్స్ (నాటౌట్) 13, కాట్రెల్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173.
వికెట్ల పతనం: 1–12, 2–17, 3–17, 4–91, 5–103, 6–141, 7–152, 8–169.
బౌలింగ్: దీపక్ చాహర్ 4–0–20–2; భువనేశ్వర్ 4–0–41–2; షమీ 4–0–25–2; శివమ్ దూబే 3–0–32–0; కుల్దీప్ యాదవ్ 4–0–45–2; వాషింగ్టన్ సుందర్ 1–0–5–0.
►2 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు నెగ్గిన రెండో క్రికెటర్ కోహ్లి (15). ఈ జాబితాలో సచిన్ (19) అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా అవార్డుతో మూడో స్థానంలో ఉన్న జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా–14)ను కోహ్లి దాటేశాడు.
►1 అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరాజయాలు పొందిన జట్టుగా అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక సరసన విండీస్ చేరింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 61 టి20 మ్యాచ్‌ల చొప్పున ఓడిపోయాయి.
►1 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ 70 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి.
►4 ఒకే దేశంలో అంతర్జాతీయ టి20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన నాలుగో క్రికెటర్, భారత్ తరఫున తొలి క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. గప్టిల్ (న్యూజిలాండ్), మొహమ్మద్ షహజాద్ (అఫ్గానిస్తాన్– యూఏఈలో), కొలిన్ మున్రో (న్యూజిలాండ్) కూడా ఈ ఘనత సాధించారు.
►5 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో భారత ఓపెనర్లిద్దరూ అర్ధ సెంచరీలు చేయడం ఇది ఐదోసారి.
►3 అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్స్‌లు పూర్తి చేసుకున్న మూడో క్రికెటర్ రోహిత్ శర్మ. ఈ జాబితాలో గేల్ (విండీస్–534), అఫ్రిది (పాక్–476) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
నా శ్రీమతికి బహుమతి: కోహ్లి
విండీస్‌పై సాధించిన టి20 సిరీస్ విజయాన్ని తన భార్య అనుష్క శర్మకు రెండో వివాహ వార్షికోత్సవం బహుమతిగా ఇచి్చనట్లు కోహ్లి అన్నాడు. ‘నా కెరీర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లలో ఇదొకటి. అదీ మా రెండో వివాహ వార్షికోత్సవం రోజున జరగడం ఎంతో ప్రత్యేకం’ అని కోహ్లి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment