IND Vs WI 1st T20I: West Indies Beat India By 4 Runs - Sakshi
Sakshi News home page

IND vs WI: అదరగొట్టిన తిలక్‌.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి

Published Fri, Aug 4 2023 4:10 AM | Last Updated on Fri, Aug 4 2023 12:00 PM

West Indies beat India by 4 runs - Sakshi

తరూబా (ట్రినిడాడ్‌): వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను భారత్‌ తడబడుతూ ఆరంభించింది. సులువైన లక్ష్యాన్ని కూడా ఛేదించలేక జట్టు ఓటమిని ఆహ్వానించింది. గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో విండీస్‌ చేతిలో ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

కెప్టెన్‌ రావ్‌మన్‌ పావెల్‌ (32 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్‌ పూరన్‌ (34 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లతో రాణించగా, బ్రెండన్‌ కింగ్‌ (19 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్, అర్ష్దీప్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (22 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ ఆదివారం ప్రొవిడెన్స్‌లో జరుగుతుంది.  

రాణించిన పూరన్‌... 
విండీస్‌ ఇన్నింగ్స్‌ను కింగ్‌ దూకుడుగా మొదలుపెట్టాడు. మేయర్స్‌ (1)తో తొలి వికెట్‌ భాగస్వామ్యంలో 4 ఓవర్లలో 29 పరుగులు రాగా, ఇందులో కింగ్‌ ఒక్కడే 28 పరుగులు సాధించాడు. అయితే తర్వాతి ఓవర్‌ వేసిన చహల్‌ తొలి మూడు బంతుల్లోనే ఓపెనర్లు ఇద్దరినీ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపించాడు.

పూరన్‌ తాను ఆడిన తొలి 6 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 54 పరుగులకు చేరింది. కొత్త ఆటగాడు తిలక్‌ వర్మ వరుసగా రెండు క్యాచ్‌లు పట్టడంతో చార్లెస్‌ (3), పూరన్‌ వెనుదిరిగారు. మరో  ఎండ్‌లో పావెల్‌ ధాటిగా ఆడిన కొన్ని షాట్లు  విండీస్‌కు కాస్త మెరుగైన స్కోరు అందించాయి.   

తిలక్‌ వర్మ మినహా... 
ఓపెనర్లిద్దరూ విఫలం కావడంతో ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించకపోగా... సూర్యకుమార్‌ యాదవ్‌ (21 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ కలిసి స్కోరును పెంచారు. తాను ఎదుర్కొన్న రెండో బంతిని సిక్సర్‌గా మలచి ఖాతా తెరచిన తిలక్, తర్వాతి బంతిని కూడా సిక్సర్‌ బాదాడు. పవర్‌ప్లేలో భారత్‌ 45 పరుగులు చేసింది. ఆ తర్వాత షెఫర్డ్‌ ఓవర్లోనూ అతను వరుసగా 6, 4 కొట్టాడు.

అయితే తక్కువ వ్యవధిలో సూర్య, తిలక్‌ వెనుదిరిగారు. హార్దిక్‌ పాండ్యా (19), సంజు సామ్సన్‌ (12) క్రీజ్‌లో ఉన్నంతసేపు భారత్‌ గెలుపుపై ధీమా ఉన్నా...‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హోల్డర్‌ ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్‌ చేయడంతో ఆశలు సన్నగిల్లాయి. చివర్లో అర్ష్దీప్‌ (12) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.  

తిలక్‌ వర్మ అరంగేట్రం  
హైదరాబాద్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున రెండు సీజన్లలో ఆకట్టుకున్న ఈ ఎడంచేతి వాటం బ్యాటర్‌ గురువారం తన తొలి మ్యాచ్‌ ఆడాడు. ఈ పర్యటనలో ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేసిన పేసర్‌ ముకేశ్‌ కుమార్‌కు కూడా ఇది తొలి టి20 మ్యాచ్‌. భారత్‌ తరఫున టి20లు ఆడిన 103, 104వ ఆటగాళ్లుగా వీరిద్దరు నిలిచారు.  

200 అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా భారత్‌ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో పాకిస్తాన్‌ (223 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ (193), శ్రీలంక (179), ఆ్రస్టేలియా (174) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.   

స్కోరు వివరాలు 
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కింగ్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 28; మేయర్స్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 1; చార్లెస్‌ (సి) తిలక్‌ (బి) కుల్దీప్‌ 3; పూరన్‌ (సి) తిలక్‌ (బి) పాండ్యా 41; పావెల్‌ (సి) కుల్దీప్‌ (బి) అర్ష్దీప్‌ 48; హెట్‌మైర్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్దీప్‌ 10; షెఫర్డ్‌ (నాటౌట్‌) 4; హోల్డర్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–29, 2–30, 3–58, 4–96, 5–134, 6–138. బౌలింగ్‌: అర్ష్దీప్‌ 4–0–31–2, ముకేశ్‌ 3–0–24–0, అక్షర్‌ 2–0–22–0, చహల్‌ 3–0–24–2, పాండ్యా 4–0–27–1, కుల్దీప్‌ 4–0–20–1.  
భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) పావెల్‌ (బి) మెకాయ్‌ 6; గిల్‌ (స్టంప్డ్‌) చార్లెస్‌ (బి) హొసీన్‌ 3; సూర్యకుమార్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హోల్డర్‌ 21; తిలక్‌ (సి) హెట్‌మైర్‌ (బి) షెఫర్డ్‌ 39; పాండ్యా (బి) హోల్డర్‌ 19; సామ్సన్‌ (రనౌట్‌) 12; అక్షర్‌ (సి) హెట్‌మైర్‌ (బి) మెకాయ్‌ 13; కుల్దీప్‌ (బి) షెఫర్డ్‌ 3; అర్ష్దీప్‌ (రనౌట్‌) 12; చహల్‌ (నాటౌట్‌) 1; ముకేశ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–5, 2–28, 3–67, 4–77, 5–113, 6–113, 7–129, 8–140, 9–144. బౌలింగ్‌: హొసీన్‌ 4–0–17–1, మెకాయ్‌ 4–0–28–2, జోసెఫ్‌ 4–0–39–0, హోల్డర్‌ 4–1–19–2, షెఫర్డ్‌ 4–0–33–2.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement