వెస్టిండీస్ జట్టు ఇటీవలే అఫ్గానిస్తాన్‌పై వన్డే సిరీస్‌లో విజయం సాధించింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆ జట్టు ఒక సిరీస్ గెలవగలిగింది. అయితే ఆ వెంటనే అదే అఫ్గాన్ జట్టు చేతిలో టి20 సిరీస్‌ను కోల్పోయింది. ఇదే విండీస్ నిలకడలేమికి నిదర్శనం. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ విజేతగా ఉన్నా జట్టులో ఏ ఒక్క ఆటగాడిపైనా పూర్తిగా నమ్మకం పెట్టలేని స్థితి. ఇలాంటి నేపథ్యంలో పటిష్టమైన భారత జట్టును వారి సొంతగడ్డపై టి20లు, వన్డేల్లో నిలువరించడం అంత సులువు కాదు. కెప్టెన్ పొలార్డ్ మినహా క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్‌లాంటి భారత అభిమానులు గుర్తించే ఆటగాళ్లెవరూ ఇప్పుడు జట్టులో లేరు. ఈ నేపథ్యంలో విండీస్ జట్టు తాజా స్థితిని విశ్లేషిస్తే...
సీపీఎల్‌తో దక్కిన గుర్తింపుతో...
విండీస్ జట్టులో యువ ఆటగాళ్ల ఎంపిక మొత్తం వారి కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ప్రదర్శనపైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. హేడెన్ వాల్‡్ష జూనియర్ (లెగ్ స్పిన్నర్), బ్రెండన్ కింగ్ (ఓపెనర్)లకు లీగ్ ప్రదర్శన తర్వాత వెంటనే జాతీయ జట్టులో చోటు దక్కింది. అయితే ఇటీవల అఫ్గాన్‌తో లక్నోలో జరిగిన సిరీస్‌లో వీరిద్దరు విఫలమయ్యారు. భారత గడ్డపై పిచ్‌లకు వారి ఆట సరిపోలేదు. సరిగ్గా చెప్పాలంటే సీపీఎల్ స్థాయికి, భారత్‌లో ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడే స్థాయికి మధ్య అనంతమైన అంతరం ఉంది. కాబట్టి వీరు భారత్‌లో ఎలా ఆడతారో చూడాలి.
స్పిన్నర్ ఎక్కడ?
విదేశీయులైనా సరే వైవిధ్యం ఉన్న స్పిన్నర్లయితే భారత్‌లోనూ మంచి ఫలితాలు సాధించగలరని గతంలో రుజువైంది. ఐపీఎల్‌లో నరైన్ విలువేమిటో అందరికీ తెలుసు. అయితే గాయంతో ఇప్పుడు అతను విండీస్ జట్టుకు దూరమయ్యాడు. హేడెన్ వాల్ష్కు ఏమాత్రం అనుభవం లేకపోగా, ఆఫ్‌స్పిన్నర్ ఖారీ పైర్‌ను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు నల్లేరు మీద నడకలాంటిదే. పైర్ కూడా సీపీఎల్ నుంచే వెలుగులోకి వచ్చాడు.
పొలార్డ్ నాయకత్వం ఎలా ఉంది?
సిరీస్ నేపథ్యంలో ఇటీవల రోహిత్ శర్మ, పొలార్డ్‌లతో రూపొందించిన టీవీ ప్రకటన అందరిలోనూ ఆసక్తి రేపింది. పొలార్డ్‌కు ఎంతో అనుభవం ఉన్నా కెప్టెన్సీపరంగా అతడికి పెద్దగా గుర్తింపు లేదు. అఫ్గానిస్తాన్‌తో ఆరు మ్యాచ్‌లు సహా అతను ఇప్పటి వరకు ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్‌లలోనే విండీస్‌కు నాయకత్వం వహించాడు.
అయితే విండీస్‌కు మరో ప్రత్యామ్నాయం లేక భారీ హిట్టర్ అయిన పొలార్డ్‌కే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అప్పగించారు. అయితే పూరన్ తదితర యువ ఆటగాళ్లను ప్రోత్సహించి, తీర్చిదిద్దడంలో అతనిదే కీలక పాత్ర అని విండీస్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అతనిలోని అసలైన నాయకత్వ లక్షణాలకు భారత్‌తో సిరీస్ ఒక సవాల్ కానుంది. దీనిని అతను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం.
అలెన్‌పై ఆశలు..
రసెల్‌లాంటి భీకరమైన హిట్టర్ దూరం కావడంతో లోయర్ ఆర్డర్‌లో అదే తరహా ఆటగాడి కోసం విండీస్ అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఈ సిరీస్‌లో ఆ జట్టు అలెన్‌పై అలాంటి ఆశలు పెట్టుకుంటోంది. ఈ ఏడాది సీపీఎల్‌లో అలెన్ 16నుంచి 20 ఓవర్ల మధ్య బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఏకంగా 225 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. కొంత వరకు స్పిన్ బౌలింగ్ కూడా చేయగల ఇతను అద్భుతమైన ఫీల్డర్ కావడం అదనపు బలం.
వీరు ఆడితేనే...
పెద్దగా అనుభవం లేని జట్టు, భారత్‌లో పరిస్థితులపై అవగాహన లేని ఆటగాళ్లే ఎక్కువ. ఇలాంటి స్థితిలో విండీస్ కొందరు ఆటగాళ్లపైనే ఆశలు పెట్టుకుంటోంది. గతంలో చెప్పుకోదగ్గ రికార్డు లేకపోయినా సరే కొంత వరకైనా వీరు రాణిస్తేనే విండీస్‌కు విజయావకాశాలు ఉంటాయనేది వాస్తవం. బౌలింగ్ అంతంత మాత్రంగానే ఉండటంతో పొలార్డ్, హెట్‌మైర్, లూయిస్, పూరన్‌ల బ్యాటింగ్ ఆ జట్టును ఆదుకోవచ్చు.
అమెరికా టు వెస్టిండీస్
వెస్టిండీస్ జట్టులోని లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ జూనియర్ అఫ్గాన్‌తో మ్యాచ్ తర్వాత అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అమెరికా తరఫున 8 టి20లు, 1 వన్డే మ్యాచ్ ఆడిన అనంతరం అతనికి వెస్టిండీస్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 25న అమెరికా తరఫున ఆడితే రెండు నెలలు తిరిగేలోగా అతను విండీస్ తరఫున ఆడాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా అసోసియేట్ జట్టు ఆటగాడు మ్యాచ్ ఆడిన మరుసటి రోజే పూర్తిస్థాయి సభ్య దేశం తరఫున బరిలోకి దిగవచ్చు.
అమెరికా ఆధీనంలో ఉన్న వర్జిన్ ఐలాండ్స్‌లోని సెయింట్ క్రాయిక్స్‌లో హేడెన్ పుట్టాడు. దాంతో సహజంగానే అమెరికా దేశస్తుడయ్యాడు. ఆ తర్వాత పసితనంలోనే ఆంటిగ్వాకు వలస వెళ్లడంతో రెండు దేశాల పౌరసత్వం కూడా లభించింది. వెస్టిండీస్‌లో భాగమైన లీవార్డ్ ఐలాండ్స్, బార్బడోస్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనంతరం తన అమెరికా పాస్‌పోర్టుతో అతను ఆ జట్టు సెలక్షన్స్‌కు హాజరయ్యాడు. యూఎస్‌ఏ తరఫున ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 2 (వన్డే), టి20 వరల్డ్ కప్ అమెరికాస్ రీజియన్ ఫైనల్ (టి20లు)లో వాల్ష్ ప్రాతినిధ్యం వహించాడు. సీపీఎల్ 2019లో వాల్ష్ అత్యధికంగా 21 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment