ఓపికగా... కొండంత... | India build huge lead against South Africa in final Test in Delhi | Sakshi
Sakshi News home page

ఓపికగా... కొండంత...

Published Sun, Dec 6 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

ఓపికగా... కొండంత...

ఓపికగా... కొండంత...

ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా కనీసం 250 మార్కును చేరలేదు.

భారీ ఆధిక్యంలో భారత్
భారీ ఆధిక్యంలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 190/4
భారీ ఆధిక్యంలో భారత్ మొత్తం ఆధిక్యం 403 పరుగులు
భారీ ఆధిక్యంలో భారత్ రాణించిన కోహ్లి, రహానే
భారీ ఆధిక్యంలో భారత్ దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు
 

 ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా కనీసం 250 మార్కును చేరలేదు. ఏకంగా ఐదు ఇన్నింగ్స్‌లో 200లోపే ఆలౌటైంది. అలాంటి జట్టుకు నాలుగో టెస్టులో కొండంత లక్ష్యం ఎదురవబోతోంది. బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతున్న పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ ఎనలేని ఓపికను చూపించి ఏకంగా ఆధిక్యాన్ని 400 దాటించారు. రహానే మరోసారి తన క్లాస్ చూపిస్తే... కోహ్లి ఎట్టకేలకు కుదురుగా ఆడాడు. ఫలితం... భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఇంకా డిక్లేర్ చేయకుండానే మ్యాచ్ గెలిచే ఆధిక్యం సాధించింది. ఇక తేలాల్సింది ఒక్క విషయమే. నాలుగో టెస్టును నాలుగోరోజే ముగిస్తారా..? లేక సఫారీలు ఈ కొండను చేరుకునేందుకు పోరాడి ఐదో రోజు దాకా తీసుకెళతారా..?
 
 న్యూఢిల్లీ: బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ నిలకడను చూపెట్టారు. పరుగులు భారీగా రాకపోయినా.. వికెట్లను కాపాడుకుంటూ సఫారీ బౌలర్లను సమర్థంగా అడ్డుకున్నారు. అద్భుతమైన టెక్నిక్‌తో పాటు కొండంత ఓపికను చూపెట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లి (154 బంతుల్లో 83 బ్యాటింగ్; 10 ఫోర్లు),రహానే (152 బంతుల్లో 52 బ్యాటింగ్; 5 ఫో ర్లు) జట్టుకు భారీ ఆధిక్యాన్ని సమకూర్చారు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసిన భారత్ నాలుగో రోజు లంచ్‌కు అటు ఇటూగా డిక్లేర్ చేసే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా శనివారం మూడో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. కోహ్లి, రహానే క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కోహ్లిసేన 403 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 334 ఆలౌట్
 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 121 ఆలౌట్
 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) విలాస్ (బి) మోర్కెల్ 3; ధావన్ (బి) మోర్కెల్ 21; రోహిత్ (బి) మోర్కెల్ 0; పుజారా (బి) తాహిర్ 28; కోహ్లి బ్యాటింగ్ 83; రహానే బ్యాటింగ్ 52; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (81 ఓవర్లలో 4 వికెట్లకు) 190.
 
 వికెట్ల పతనం: 1-4; 2-8; 3-53; 4-57.
 
 బౌలింగ్: మోర్కెల్ 17-6-29-3; అబాట్ 17-6-38-0; పీట్ 18-1-53-0; తాహిర్ 21-4-49-1; ఎల్గర్ 8-1-19-0.

  ఈసారి అదృష్టం...
 ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ బంతి విరాట్ కోహ్లి బ్యాట్‌కు దగ్గరి నుంచి వెళ్లి కీపర్ విలాస్ చేతుల్లో పడింది. కీపర్ అప్పీల్ చేయడంతో అంపైర్ అవుటిచ్చాడు. దీనిపై కొన్ని సెకన్ల పాటు అసంతృప్తిని వ్యక్తం చేసిన కెప్టెన్ ఇక చేసేదేమీ లేక పెవిలియన్‌కు వెళ్తున్నాడు. అయితే థర్డ్ అంపైర్ రీప్లేలో అది నోబాల్‌గా తేలడంతో కోహ్లి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి దురదృష్టవశాత్తు అవుటైన సంగతి తెలిసిందే.     
 
 సెషన్-1 మోర్కెల్ హవా...
 ఆరంభంలో పిచ్‌పై ఉండే తేమను సద్వినియోగం చేసుకున్న ప్రొటీస్ పేసర్లు కట్టుదిట్టమైన బంతులతో చెలరేగారు. దీంతో పరుగులు చేయడానికి భారత ఓపెనర్లు బాగా ఇబ్బందులుపడ్డారు. చివరకు ఐదో ఓవర్‌లోనే మోర్కెల్ వేసిన షార్ట్ బంతిని ఎదుర్కోలేక విజయ్ (3) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో రోహిత్ శర్మ (0)ను మేనేజ్‌మెంట్ మూడోస్థానానికి ప్రమోట్ చేసింది. అయితే మోర్కెల్ దెబ్బకు అతను డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ స్కోరు 8/2గా మారింది. ధావన్ (21), పుజారా (28)లు పూర్తి రక్షణాత్మకంగా ఆడటంతో భారత్ 51/2 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.       ఓవర్లు: 26; పరుగులు: 51; వికెట్లు: 2
 
 సెషన్-2 కోహ్లి నిలకడ
 లంచ్ తర్వాత మూడో ఓవర్‌లోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మోర్కెల్ వేసిన అద్భుతమైన యార్కర్‌కు ధావన్ వికెట్ ఎగిరిపోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లి చాలా నెమ్మదిగా ఆడినా... స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.  అయితే రెండో ఎండ్‌లో తాహిర్ బంతిని కట్ చేయడానికి ప్రయత్నించి పుజారా వెనుదిరగడంతో భారత్  57 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఇక రహానే ఈసారి మరింత నిలకడను చూపెట్టాడు. సెషన్ ముగిసే వరకు ఈ ఇద్దరు ఏమాత్రం తడబాటు లేకుండా ఆడటంతో భారత్ ఇన్నింగ్స్ కాస్త గాడిలో పడింది.     ఓవర్లు: 28; పరుగులు: 65; వికెట్లు: 2
 
 సెషన్-3 సూపర్ భాగస్వామ్యం
 కోహ్లి 70 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఓవైపు కెప్టెన్ జోరు కొనసాగుతుంటే రెండోవైపు రహానే ఇన్నింగ్స్‌లో వేగం పెరగలేదు.  రహానే 146 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ జోడిని విడదీయడానికి ఆమ్లా బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 133 పరుగులు జోడించారు. బ్యాడ్‌లైట్ కారణంగా మ్యాచ్‌ను కాస్త ముందుగానే ముగించడంతో భారత్ మరో వికెట్ పడకుండా సెషన్‌ను పూర్తి చేసింది.   ఓవర్లు: 27; పరుగులు: 74; వికెట్లు: 0

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement