సునీల్ గావస్కర్ హయాంలో...
సచిన్ టెండూల్కర్ శకంలో...
విరాట్ కోహ్లి తరంలో...
కాలం ఎంత మారినా విదేశీ పర్యటనల్లో టీమిండియాది ఒకటే కథ! పరాజయాల వ్యథ! దీనికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం! జట్టులోని టాప్ బ్యాట్స్‌మెన్ విశేషంగా రాణించినా, మిగతా వారు సహాయ పాత్ర పోషించ లేకపోవడంతో పరాభవాలు పరిపాటి అయిపోయాయి. ఎక్కడిదాకో ఎందుకు? ఈ ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనలే దీనికి సరైన నిదర్శనం. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ వంతు వచ్చింది. విజయం మనదేనన్న అంచనాలున్నాయి. అయితే, బలమైన ప్రత్యర్థి బౌలింగ్ బలగాన్ని ఎదుర్కొంటూ... కోహ్లికి సహచరులు శక్తిమేర సహకరిస్తేనే ఇది సాధ్యం.
సాక్షి క్రీడా విభాగం : దక్షిణాఫ్రికాలో 1–2తో ఓటమి. ఇంగ్లండ్‌లో 1–4తో పరాజయం. 2018లో టీమిండియా రెండు విదేశీ పర్యటనల్లో ఫలితాలివి. గణాంకాల ప్రకారం మన జట్టు ఈ సిరీస్‌లు కోల్పోయిందనే చెప్పాలి. వాస్తవంలో మాత్రం విరాట్ కోహ్లి మినహా ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యమే కారణమని విశ్లేషించాలి. సఫారీలపై 72, 135 పరుగుల తేడాతో రెండు టెస్టులను చేజార్చుకోగా, ఇంగ్లండ్‌పై 31, 60, 118 పరుగుల వ్యత్యాసంతో ఏకంగా మూడు టెస్టుల్లో పరాజయం పాలయ్యాం. ఛేదించదగిన లక్ష్యాలతో బరిలో దిగిన ఈ సందర్భాల్లో కెప్టెన్ వీరోచిత ఆటకు ఏ మాత్రం సహకారం అందినా ఫలితం మనవైపే ఉండేది. మళ్లీ మళ్లీ రాని ఇలాంటి సువర్ణావకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే, ప్రస్తుత జట్టు రికార్డుల్లోకి ఎక్కేది. ఈ గతమంతా మర్చిపోయి... రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో ‘పేరు గొప్ప’ లైనప్ సమష్టిగా రాణిస్తేనే సిరీస్ వశమవుతుంది. ఈ నేపథ్యంలో పరిస్థితేమిటో చూద్దాం!
ఆరంభం అదిరితేనే...
సంప్రదాయ క్రికెట్లో శుభారంభాలే మ్యాచ్ గతిని నిర్దేశిస్తాయి. కానీ, కొంతకాలంగా టీమిండియా ఓపెనర్ల విషయంలోనే ఎక్కువ సమస్య ఎదుర్కొంటున్నది. ధావన్‌తో పాటు మురళీ విజయ్, లోకేశ్ రాహుల్‌లకు పదేపదే అవకాశాలు వచ్చినా జట్టు ఆశించినదైతే ఇవ్వలేకపోయారు. వీరిలో తన ఫామ్ కంటే... రాహుల్ నిలకడ లేమి, అనుభవం రీత్యా విజయ్ ఆసీస్ పర్యటనకు అనూహ్యంగా ఎంపికయ్యాడు. అయితే, అతడు మునుపటిలా సాధికారికంగా లేడు. యువ పృథ్వీ షా గాయపడకుంటే తుది జట్టులో చోటు కష్టమే అయ్యేది. ఏదేమైనా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో వైఫల్యాల తర్వాత అంతా మర్చిపోతున్న సమయంలో దక్కిన ఈ చాన్స్ విజయ్‌కు ఒక రకంగా రెండో ఇన్నింగ్సే. ప్రాక్టీస్ మ్యాచ్‌లో శతకంతో ఫర్వాలేదనిపించిన అతడు... కెరీర్‌ను రెండు, మూడేళ్లు పొడిగించుకోవాలంటే ఆస్ట్రేలియాలో ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. లేదంటే, ఇంతటితో తన ఇన్నింగ్స్ ముగిసినట్లే. ఇక, చక్కటి స్ట్రోక్ ప్లే, డిఫెన్స్, దూకుడు అన్నీ ఉన్నా రాహుల్‌ది మరో కథ. ఒక మ్యాచ్‌లో శతకం చేస్తే మరో మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే ఔటవుతుంటాడు. మూడు ఫార్మాట్లలో అతడి బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువగా మారనిది టెస్టుల్లోనే అయినా, ప్రతిభకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌పై చివరి టెస్టులో భారీ శతకం తర్వాత, లోపలకు దూసుకొచ్చే బంతులకు వికెట్ ఇచ్చేసే బలహీనతతో సొంతగడ్డపై వెస్టిండీస్ సిరీస్‌లో విఫలమయ్యాడు. కంగారూ బౌలర్లను ఎదుర్కొనాలంటే ఈ లోపాన్ని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వయసు, ఫామ్ పరంగా 35 ఏళ్ల విజయ్‌కు..., నిలకడ లేమి, టెక్నిక్ లోపాల కారణంగా రాహుల్‌కు ఆసీస్ సిరీస్ కఠిన పరీక్ష. ఓ విధంగా ఆఖరి అవకాశం. ఈసారి రాణించకుంటే పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లకు తమ స్థానాలను అప్పగించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.
కెప్టెన్‌కు అటు ఇటు...
ద్రవిడ్ తర్వాత ది వాల్‌గా గుర్తింపు పొందిన పుజారా కొన్నాళ్లుగా ఆ స్థాయిలో గోడ కట్టలేకపోతున్నాడు. క్రీజులో గంటలకొద్దీ పాతుకుపోయి బౌలర్ల సహనాన్ని పరీక్షించే ఒకప్పటి పుజారా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాడు. అతడు పూర్తి సామర్థ్యం మేర రాణించి ఉంటే గత రెండు విదేశీ పర్యటనల్లో భారత్ కొంత మెరుగైన ఫలితాలు సాధించేది. టెక్నిక్ లోపం కొంత, దృక్పథం లోపం కొంత కలగలిసి అతడిని వెనక్కు లాగుతున్నాయి. మెడపై నిత్యం వేటు కత్తి వేలాడుతున్న పరిస్థితుల్లో తక్కువ స్ట్రయిక్ రేట్ వంటి అంశాలను సాకుగా చూపి తొలగించకుండా ఉండాలంటే కంగారూల పర్యటనలో పుజారా భారీ ఇన్నింగ్స్‌లు ఆడక తప్పదు. మరోవైపు ఆడినా, ఆడకున్నా వైస్ కెప్టెన్ హోదా పొందుతూ వస్తోన్న అజింక్య రహానేది చిత్రమైన సమస్య. జట్టులో తానొకడు ఉన్నాడన్న సంగతే గుర్తురానంతగా ఉంది అతడి బ్యాటింగ్ పాటవం. ఇంగ్లండ్‌లో రహానే ఆట మరీ సాధారణం. ఈ నేపథ్యంలో వీరికి ముందున్నది ముళ్లబాటే. ముఖ్యంగా హనుమ విహారి రూపంలో తక్షణ ప్రత్యామ్నాయం ఉన్న నేపథ్యంలో రహానే ఉనికిని బలంగా చాటుకోక తప్పదు. కోహ్లికి అటు ఇటు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే వీరు రాణిస్తే భారత్‌కు పెద్ద బెంగ తీరుతుంది.
ఊరట... ఊరింపు!
టెస్టులపై ఆశలు కోల్పోయిన పరిస్థితుల్లో... పరిమిత ఓవర్ల ఫామ్‌తో ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యాడు రోహిత్ శర్మ. ఇంతకాలం ఆరో స్థానంలో తప్ప తనను మరోచోట ఆడించే ఆలోచన చేయలేదు. అయితే, జట్టు అవసరాలను గుర్తించిన రోహిత్ ఓపెనింగ్‌కైనా సిద్ధమన్నాడు. అందుకు తగ్గట్లే పృథ్వీ గాయంతో ఓ దశలో అతడి పేరు ఓపెనింగ్‌కు ప్రస్తావనకొచ్చింది. ఇదే సిరీస్‌లో ఇందుకు ఉన్న అవకాశాలను పూర్తిగా కొట్టి పారేయలేం కూడా. ఇప్పటికైతే రోహిత్ ఆరో స్థానానికే పోటీదారు. తుది జట్టులో చోటు లేకున్నా, అసలు టెస్టు జట్టులోనైతే ఉన్నానన్న సంతృప్తితో రోహిత్ ఊరట పొందొచ్చు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆఖరి టెస్టులో అవకాశంతో సత్తా చాటిన విహారి... ఆస్ట్రే లియా పర్యటనపై ఆశావహంగా ఉండొచ్చు. ఆఫ్ స్పిన్‌తో వికెట్లు పడగొట్టగల నైపుణ్యం ఉన్నందున విహారి సేవలను కోహ్లి ఏ క్షణమైనా ఉపయోగించుకునే ఆలోచన చేయొచ్చు. అయితే, ఆరుగురు బ్యాట్స్‌మెన్ వ్యూహంతో బరిలో దిగితేనే రోహిత్, విహారిలలో ఎవరికైనా అవకాశం ఉంటుంది.
టెస్టు సిరీస్ షెడ్యూల్
తొలి టెస్టు (అడిలైడ్) డిసెంబర్ 6–10
రెండో టెస్టు ( పెర్త్) డిసెంబర్ 14–18
మూడో టెస్టు (మెల్‌బోర్న్) డిసెంబర్ 26–30
నాలుగో టెస్టు (సిడ్నీ) జనవరి 3–7
Comments
Please login to add a commentAdd a comment