క్లీన్‌స్వీప్‌తో ‘టాప్’
ఆస్ట్రేలియా పర్యటనకు అద్భుతమైన ముగింపు... తమ బ్యాటింగ్ బలం చూపిస్తూ చివరి టి20లోనూ టీమిండియా చెలరేగింది. భారీ లక్ష్యం ముందున్నా... ఆఖరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగినా... చివరకు ధోనిసేనదే పైచేయి అయింది. ఫలితమే 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్. నాలుగు వన్డేల్లో ఓడినా, చివరకు ఐదో వన్డేలో గెలుపుతో స్వాంతన పొందిన భారత జట్టు టి20ల్లో ఆస్ట్రేలియాకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బతీసి గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.
సిడ్నీ వన్డేకు ముందు... మాలో సత్తాకు లోటు లేదు. ఇదీ గెలుస్తాం. మూడు టి20లూ గెలుస్తాం అని బల్లగుద్దిన కోహ్లి తన మాట నెగ్గించుకున్నాడు. మరో అర్ధ సెంచరీతో అతను ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలవగా... రోహిత్, రైనా, ధావన్‌ల జోరుతో అదే సిడ్నీ మైదానంలో మళ్లీ భారత జెండా ఎగిరింది. అటు అద్భుత సెంచరీ, చక్కటి బౌలింగ్, కెప్టెన్సీతో అన్నీ తానై నడిపించిన వాట్సన్ ఆస్ట్రేలియా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
సిరీస్ ఆరంభానికి ముందు ఎనిమిదో స్థానం... ఇప్పుడు ఆసీస్ గడ్డపై ప్రదర్శనతో నేరుగా నంబర్‌వన్. తాజా విజయంతో ఐసీసీ టి20 ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. సొంతగడ్డపై ప్రపంచకప్‌కు ముందు నంబర్‌వన్ కావడం ధోని సేనకు మరింత స్ఫూర్తినిచ్చే అంశం.
* నంబర్‌వన్ ర్యాంకుకు టీమిండియా
* మూడో టి20లోనూ భారత్ విజయం
* 3-0తో సిరీస్ సొంతం
* ఏడు వికెట్లతో ఆసీస్ చిత్తు
* వాట్సన్ సెంచరీ వృథా
సిడ్నీ: విజయం కోసం భారత్ చివరి 3 ఓవర్లలో 34 పరుగులు చేయాలి. రైనా రెండు బౌండరీలు కొట్టడంతో 18వ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. మరో వైపు యువరాజ్ ఇబ్బందిగా ఆడటంతో తర్వాతి ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. దాంతో ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రయికింగ్‌లో యువీ ఉండటంతో కాస్త ఆందోళన... కానీ అంత ఒత్తిడిలోనూ అతనే వరుస బంతుల్లో 4, 6 బాది పని సులువు చేశాడు. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా రైనా బౌండరీతో మ్యాచ్ ముగించడంతో భారత శిబిరంలో సంబరాలు, ఆస్ట్రేలియన్స్‌కు ఆవేదన.
ఆదివారం ఆసక్తికరంగా సాగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (71 బంతుల్లో 124 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగాడు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (38 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా, సురేశ్ రైనా (25 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకున్న భారత్, ఆసీస్ పర్యటనను విజయంతో ముగించింది. అంతకుముందు వన్డే సిరీస్‌ను భారత్ 1-4తో కోల్పోయింది.
అంతా వాట్సనే...
టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకొని ఇద్దరు కొత్త ఆటగాళ్లు ఖాజా, బెన్‌క్రాఫ్ట్‌లను జట్టులోకి తీసుకుంది. మూడో ఓవర్లో ఖాజా (14)ను అవుట్ చేసి నెహ్రా తొలి వికెట్ అందించాడు. మరోవైపు వాట్సన్ తనదైన శైలిలో జోరు మొదలు పెట్టాడు. బుమ్రా, నెహ్రా, పాండ్యాల బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదాడు. మార్ష్ (9), మ్యాక్స్‌వెల్ (3) విఫలం కాగా... హెడ్ (19 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) వాట్సన్‌కు సహకరించాడు. 56 పరుగుల వద్ద డీప్ కవర్‌లో కోహ్లి క్యాచ్ వదిలేయడంతో వాట్సన్‌కు మరో అవకాశం దక్కింది. జడేజా వేసిన 17వ ఓవర్ ఆసీస్‌కు బాగా కలిసొచ్చింది. ఇందులో రెండు సిక్సర్లు, ఫోర్ బాది వాట్సన్ 19 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 60 బంతుల్లో టి20 కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో బుమ్రా, నెహ్రా చక్కటి బౌలింగ్ చేయడంతో ఆసీస్ స్కోరు 200లోపే ఆగిపోయింది.
సమష్టిగా...
భారీ ఛేదనలో భారత బ్యాటింగ్ ఏ దశలోనూ ఒత్తిడికి గురి కాకపోవడంతో పరుగుల జోరు తగ్గలేదు. రోహిత్, శిఖర్ ధావన్ (9 బంతుల్లో 26; 4 ఫోర్లు, ఒక సిక్స్) 20 బంతుల్లోనే 46 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ముఖ్యంగా టెయిట్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ధావన్ వరుస బంతుల్లో 4, 6, 4 బాదాడు. మొత్తంగా ఆ ఓవర్లో 24 పరుగులు రావడం విశేషం. తర్వాతి ఓవర్లో ధావన్ అవుటైనా... కోహ్లి క్రీజ్‌లోకి వచ్చి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.
బాయ్‌స్ బౌలింగ్‌లో రోహిత్ వెనుదిరగ్గా... రైనా ఎదుర్కొన్న రెండో బంతిని సునాయాసంగా స్టంప్ చేయడంలో కీపర్ బెన్‌క్రాఫ్ట్ విఫలమయ్యాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన కోహ్లి కూడా బాయ్‌స్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అనంతరం గెలిచేందుకు 31 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన దశలో రైనా చెలరేగిపోయాడు. యువరాజ్ (12 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) సహకారంతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
యువరాజ్ బతికిపోయాడా...
తొలి రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసేందుకు అవకాశమే రాలేదు. మూడు మ్యాచ్‌లలో కలిపి బౌలింగ్ చేసింది ఐదు ఓవర్లే! టి20 సిరీస్ కోసమే ఎంపికైన యువరాజ్ ఇక తనను తాను నిరూపించుకునేదెలా? 15వ ఓవర్ ఐదో బంతికి కోహ్లి అవుటయ్యాడు. ఇక గత రెండు మ్యాచ్‌లలాగే ఈసారి కూడా ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందే వస్తే చేసేదేముంది! ఇలాంటి స్థితిలో అదృష్టవశాత్తూ ముందుగానే యువీ క్రీజ్‌లోకి అడుగు పెట్టాడు. అయితే అదే పాత తడబాటు. ఒక్కో బంతిని ఇబ్బందిగా ఎదుర్కొంటూ 9 బంతుల్లో 5 పరుగులు చేశాడు. బౌండరీ మాటే లేదు.
ఇది చూసే కావచ్చు 19వ ఓవర్ చివరి బంతికి అవకాశం లేకపోయినా వాట్సన్ యువీని సింగిల్ తీయనిచ్చాడు. ఈ మ్యాచ్‌లో గనుక భారత్ ఓడి ఉంటే యువీ మళ్లీ విలన్ అయిపోయేవాడు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో తిట్ల పురాణం ప్రారంభం అయిపోయేది. అయితే టై వేసిన చివరి ఓవర్ తొలి రెండు బంతులు యువీకి ఇష్టమైన ఆన్‌సైడ్ జోన్‌లోనే పడ్డాయి. ఫైన్‌లెగ్‌లో ఫోర్ వెళితే, డీప్ మిడ్‌వికెట్‌లో భారీ సిక్సర్. అంతే...మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. వచ్చే సిరీస్, ప్రపంచకప్ జట్ల ఎంపికలో ‘ఈ రెండు షాట్లు’ యువరాజ్‌కు కొత్త ఊపిరి పోస్తాయేమో..!
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖాజా (సి) ధోని (బి) నెహ్రా 14; వా ట్సన్ (నాటౌట్) 124; షాన్ మార్ష్ (బి) అశ్విన్ 9; మ్యాక్స్‌వెల్ (సి) రైనా (బి) యువరాజ్ 3; హెడ్ (బి) జడేజా 26; లిన్ (సి) జడేజా (బి) బుమ్రా 13; బెన్‌క్రాఫ్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 197.
వికెట్ల పతనం: 1-16; 2-69; 3-75; 4-168; 5-193.
బౌలింగ్: నెహ్రా 4-0-32-1; జస్‌ప్రీత్ బుమ్రా 4-0-43-1; అశ్విన్ 4-0-36-1; రవీంద్ర జడేజా 4-0-41-1; యువరాజ్ 2-0-19-1; హార్దిక్ పాండ్యా 2-0-24-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) వాట్సన్ (బి) బాయ్‌స్ 52; శిఖర్ ధావన్ (సి) బెన్‌క్రాఫ్ట్ (బి) వాట్సన్ 26; విరాట్ కోహ్లి (బి) బాయ్‌స్ 50; సురేశ్ రైనా (నాటౌట్) 49; యువరాజ్ సింగ్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200.
వికెట్ల పతనం: 1-46; 2-124; 3-147.
బౌలింగ్: షాన్ టెయిట్ 4-0-46-0; స్కాట్ బోలండ్ 3-0-34-0; వాట్సన్ 4-0-30-1; ఆండ్రూ టై 4-0-51-0; బాయ్‌స్ 4-0-28-2; మ్యాక్స్‌వెల్ 1-0-10-0.
నంబర్‌వన్ ర్యాంక్
ఆస్ట్రేలియాపై 3-0తో సిరీస్ విజయం సాధించిన భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం జట్టు ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్ (118), శ్రీలంక (118) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఏకంగా ఎనిమిదో ర్యాంక్ (110)కు పడిపోవడం గమనార్హం.
* ఏ ఫార్మాట్‌లో అయినా సొంతగడ్డపై ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌కు గురి కావడం 1877 తర్వాత ఇదే తొలిసారి.
* అంతర్జాతీయ టి20ల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరును (124) వాట్సన్ నమోదు చేశాడు. ఫించ్ (156) టాప్‌స్కోరర్. భారత్‌పై ఒక ఆటగాడు టి20ల్లో సెంచరీ చేయడం ఇదే మొదటిసారి కాగా... ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వాట్సన్ నిలిచాడు.
* టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు అర్ధ సెంచరీలు నమోదు చేసిన మొదటి ఆటగాడు కోహ్లి. ఓవరాల్‌గా టి20 ఫార్మాట్‌లో (దేశవాళీ మ్యాచ్‌లు సహా) కోహ్లి 5 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు.
* అంతర్జాతీయ టి20ల్లో భారత్ నుంచి రైనా, కోహ్లి తర్వాత రోహిత్ శర్మ కూడా వేయి పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు.
వన్డేల్లోనూ మా బ్యాట్స్‌మెన్ బాగా ఆడారు. అయితే బౌలర్లు మరింత మెరుగవ్వాలని భావించాం. టి20 సిరీస్‌లో బౌలర్లు అది చేసి చూపించారు. వారి వల్లే సిరీస్ గెలిచాం. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై 3-0తో ఓడించడం కచ్చితంగా ఆనందాన్నిస్తుంది.
ఈ పర్యటన ద్వారా బుమ్రావంటి ప్రతిభావంతుడు వెలుగులోకి వచ్చాడు. పాండ్యా కూడా ఆకట్టుకున్నాడు. సీనియర్ బౌలర్లను కాదని కొత్త కుర్రాళ్లతో ప్రయత్నించాలని ముందే అనుకున్నాను. కనీసం ఈ అనుభవంతోనైనా వారు నేర్చుకుంటారు. అప్పటి పరిస్థితిని బట్టి ఒకటి రెండు మార్పులు మినహా మా ప్రపంచకప్ జట్టు దాదాపు ఇలాగే ఉండవచ్చు.
- ధోని, భారత కెప్టెన్