వన్డే సిరీస్ ఎలాగూ పోయింది. కనీసం పొట్టి ఫార్మాట్‌లోనైనా మెరుపు బ్యాటింగ్‌తో అదరగొడదామని భావించిన ఆస్ట్రేలియాకు భంగపాటే ఎదురైంది. ఇటీవలి కాలంలో టీమిండియాకు తమ విశేష ప్రతిభతో వరుస విజయాలను అందిస్తున్న బౌలర్లు రాంచీ మ్యాచ్‌లోనూ మెరిశారు. వీరి ధాటికి అసలు బ్యాటింగ్ ఎలా చేయాలో తెలీదన్నట్టుగా ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
అటు పేసర్లు.. ఇటు స్పిన్నర్లు తమ అద్భుత బంతులతో చేసిన మూకుమ్మడి దాడికి వార్నర్ బృందంలో ఏకంగా ఆరుగురు బ్యాట్స్‌మెన్ క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో మూడు బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది. టి20ల్లో ఆసీస్‌పై భారత్‌కు వరుసగా ఇది ఏడో విజయం కావడం విశేషం.
రాంచీ: బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి టి20లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో కోహ్లి సేన 1–0 ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టి20 మంగళవారం గువాహటిలో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్‌కు చివర్లో వర్షం అంతరాయం కలిగించింది.
దీంతో ఆ జట్టు 18.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 118 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. ఆరోన్ ఫించ్ (30 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. కుల్దీప్, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్ తలా ఓ వికెట్ తీశారు.
దాదాపు రెండు గంటల అంతరాయం తర్వాత భారత్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని విధించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన భారత్ 5.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి (14 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్దీప్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఆది నుంచీ తడబాటే...
టాస్ నెగ్గి ఫీల్డింగ్‌కు దిగిన భారత్... పిచ్ అనుకూలతను సొమ్ము చేసుకుని తొలి ఓవర్ నుంచే ఆసీస్ పతనాన్ని శాసించింది. భుజం గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సిరీస్‌కు దూరం కావడంతో డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ అప్పగించారు. ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్‌లోనే వార్నర్ వరుసగా రెండు ఫోర్లు బాదినా భువనేశ్వర్ వేసిన ఐదో బంతికి బౌల్డ్ అయ్యాడు. అటు ఫించ్ మాత్రం తన ధాటిని కొనసాగించాడు. పాండ్యా వేసిన మూడో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.
అయితే పిచ్ ప్రమాదకరంగా ఉండడంతో మ్యాక్స్‌వెల్ (16 బంతుల్లో 17; 2 ఫోర్లు), ఫించ్ సహజశైలిలో ఆడలేకపోయారు. దీంతో పవర్‌ప్లేలో ఆసీస్ 49/1 స్కోరు మాత్రమే చేయగలిగింది. లెగ్ స్పిన్‌లో తన బలహీనతను మ్యాక్స్‌వెల్ అధిగమించలేక ఏడో ఓవర్‌లో చహల్‌కు దొరికిపోయాడు. అటు తొమ్మిదో ఓవర్‌లో ఫించ్ ఓ భారీ సిక్స్ బాదినా ఆ తర్వాత ఓవర్‌లో కుల్దీప్ వేసిన ఓ అద్భుత ఫుల్ బంతి అతడిని బోల్తా కొడుతూ వికెట్లను కూల్చింది.
తన మరుసటి ఓవర్‌లోనే హెన్రిక్స్ (8)ను కూడా కుల్దీప్ పెవిలియన్‌కు పంపాడు. 14వ ఓవర్‌లో పాండ్యా... ట్రావిస్ హెడ్ (9)ను బౌల్డ్ చేయడంతో ఆసీస్ 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు 15వ ఓవర్‌లో తొలి బంతికి పైన్ (16 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను చహల్... ఐదో బంతికి డీప్ మిడ్‌వికెట్‌లో భువనేశ్వర్ వదిలేశారు. 17వ ఓవర్‌లో తను ఫోర్, సిక్స్‌తో చెలరేగినా ఆ తర్వాత ఓవర్‌లో బుమ్రా... పైన్‌తో పాటు కూల్టర్‌నీల్ (1)ను కూడా బౌల్డ్ చేయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. ఈ దశలో 18.4వ ఓవర్‌లో 118/8 స్కోరు వద్ద వర్షం అంతరాయం కలిగించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసినట్టు ప్రకటించారు.
సునాయాసంగా..
ఆరు ఓవర్లలో 48 పరుగుల లక్ష్యం కోసం భారత్ బరిలోకి దిగగా... ఓపెనర్ రోహిత్ తొలి బంతినే ఫోర్‌గా మలిచాడు. కూల్టర్‌నీల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచినా ఆ తర్వాతి బంతికే బౌల్డ్ అయ్యాడు. రెండో ఓవర్‌లో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లి ఆ తర్వాత బ్యాట్‌కు పని చెప్పాడు.
అటు ధావన్ కూడా బౌండరీలు బాదుతూ స్కోరును వేగంగా పెంచాడు. చివరిదైన ఆరో ఓవర్‌లో ఆరు పరుగులు చేయాల్సి ఉండగా మూడో బంతిపై కోహ్లి ఎక్స్‌ట్రా కవర్‌లో ఓ సూపర్ ఫోర్‌తో మరో మూడు బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) భువనేశ్వర్ 8; ఫించ్ (బి) కుల్దీప్ 42; మ్యాక్స్‌వెల్ (సి) బుమ్రా (బి) చహల్ 17; హెడ్ (బి) పాండ్యా 9; హెన్రిక్స్ (బి) కుల్దీప్ 8; క్రిస్టియాన్ (రనౌట్) 9; పైన్ (బి) బుమ్రా 17; కూల్టర్‌నీల్ (బి) బుమ్రా 1; టై నాటౌట్ 0; జంపా నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో 8 వికెట్లకు) 118.
వికెట్ల పతనం: 1–8, 2–55, 3–76, 4–87, 5–89, 6–111; 7–113, 8–114.
బౌలింగ్: భువనేశ్వర్ 3.4–0–28–1; బుమ్రా 3–0–17–2; పాండ్యా 4–0–33–1; చహల్ 4–0–23–1; కుల్దీప్ 4–0–16–2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) కూల్టర్‌నీల్ 11; ధావన్ నాటౌట్ 15; కోహ్లి నాటౌట్ 22; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (5.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 49.
వికెట్ల పతనం: 1–11.
బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 1–0–5–0; కూల్టర్‌నీల్ 2–0–20–1; టై 1–0–10–0; జంపా 1–0–6–0, క్రిస్టియాన్ 0.3–0–7–0.
Comments
Please login to add a commentAdd a comment