రాంచీ:ఆసీస్ తో మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా ఇక్కడ శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా ప్రత్యర్థి ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆది నుంచి తడబడతూనే ఇన్నింగ్స్ కొనసాగించింది. అరోన్ ఫించ్ మినహాఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో ఆసీస్ 18.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఆ తరుణంలో వర్షం రావడంతో మ్యాచ్ ను గంటకు పైగా నిలిపివేశారు. దానిలో భాగంగా వర్షం నిలిచిన తరువాత భారత్ విజయ లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆరు ఓవర్లలో 48 పరుగులకు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని వికెట్ కోల్పోయి 5.3 ఓవర్లలో ఛేదించిన భారత్ విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ విశేషాలు..
1. ట్వంటీ 20ల్లో ఆసీస్ పై వికెట్ల పరంగా ఇదే భారత్ కు అతి పెద్ద విజయం. గతంలో 2012, ఫిబ్రవరి 3 వ తేదీన మెల్ బోర్న్ లో జరిగిన టీ 20లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్ ను ఓడించింది. ఆ తరువాత ఆ జట్టుపై భారత్ కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన(వికెట్ల పరంగా)
2. 2013 అక్టోబర్ 10 వ తేదీ నుంచి మొదలుకొని 2017, అక్టోబర్ 7వరకూ చూస్తే ఆసీస్ పై భారత్ సాధించిన వరుస ట్వంటీ 20 విజయాల సంఖ్య 7. వరుస టీ 20 విజయాల్లో ఇది భారత్ అత్యుత్తమ ప్రదర్శన.
3.ఇప్పటివరకూ ఆస్ట్రేలియాతో 14 ట్వంటీ 20 మ్యాచ్ లు జరగ్గా, అందులో భారత్ సాధించిన విజయాలు 10 కాగా, ఆసీస్ కు సాధించిన విజయాలు 4. దాంతో ఆసీస్ పైనే అత్యధిక టీ 20 విజయాల్ని భారత్ నమోదు చేసినట్లయ్యింది.
4.ఇది భారత్ కు 50వ ట్వంటీ 20 విజయం. మొత్తంగా భారత్ 84 ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడగా, 31 మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. రెండు ఫలితం తేలక పోగా, ఒకటి టై అయ్యింది. యాభైకిపైగా విజయాలు సాధించిన జట్లు పాకిస్తాన్(69), దక్షిణాఫ్రికా(57), శ్రీలంక(51).
5. నిన్నటి మ్యాచ్ లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసి 16 పరుగులిచ్చాడు. ఇది అతని అత్యుత్తమ టీ 20 ప్రదర్శన. తద్వారా ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ 20లో నమోదు చేసిన 2/20 ప్రదర్శనను కుల్దీప్ అధిగమించాడు.
6.ట్వంటీ 20ల్లో కుల్దీప్ కు ఇదే మొదటి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు.
7. భారత్ పై ఏడు ఇన్నింగ్స్ ల్లో 47.71 యావరేజ్ తో ఆసీస్ క్రికెటర్ అరోన్ ఫించ్ నమోదు చేసిన పరుగులు 334. దాంతో భారత్ పై ట్వంటీ 20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసీస్ క్రికెటర్ గా ఫించ్ ఘనత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment