
ఫైనల్లో భారత్
క్వాంటన్ (మలేసియా):ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో భారత జట్టు ఫైనల్ కు చేరింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 5-4 తేడాతో గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి నాలుగు క్వార్టర్లు ముగిసే సరికి ఇరు జట్లు 2-2 తో సమంగా ఉండటంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
ఇందులో భారత్ ఐదు గోల్స్ సాధించి ఫైనల్ కు చేరగా, కొరియా నాలుగు గోల్స్ కు మాత్రమే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2011లో తొలిసారి జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. మరోసారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. లీగ్ దశను దిగ్విజయంగా అధిగమించిన భారత్.. అదే జోరును సెమీస్లో కూడా కనబరించింది. కీలక ఆటగాళ్లు దూరమైనా భారత అభిమానులు పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఫైనల్లోకి ప్రవేశించింది.