ఒడెన్స్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మళ్లీ తేలిపోయింది. మరో టోరీ్నలోనూ చిత్తుగానే ఓడిపోయింది. మిగతా భారత షట్లర్లందరూ డెన్మార్క్ ఓపెన్‌లో చేతులెత్తేశారు. దీంతో ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 ఈవెంట్‌లో భారత్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన తెలుగుతేజం సింధు రెండో రౌండ్లోనే పరాజయం చవిచూసింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆమె 14–21, 17–21తో అన్ సె యంగ్ (కొరియా) చేతిలో ఓడింది.24 ఏళ్ల సింధు ఇక్కడ కూడా తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయింది. ఆగస్టులో ప్రపంచ చాంపియన్ అయ్యాక చైనా ఓపెన్‌లో రెండో రౌండ్లో, కొరియా ఓపెన్‌లో అయితే తొలిరౌండ్లోనే ఆమె కంగుతింది. గురువారం భారత ఆటగాళ్లెవరికీ కలిసిరాలేదు.
పాల్గొన్న ప్రతీ ఈవెంట్లోనూ అందరికీ చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భమిడిపాటి సాయిప్రణీత్ 6–21, 14–21తో టాప్‌సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో చిత్తుగా ఓడాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 12–21, 10–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం 16–21, 15–21తో ఆరో సీడ్ హన్ చెంగ్ కయ్–జౌ హో డాంగ్ (చైనా) జంట చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీకి కూడా నిరాశ ఎదురైంది. భారత జంట 24–26, 21–13, 11–21తో నాలుగో సీడ్ మలేసియన్ జోడి చన్ పెంగ్ సున్–గొ లియు చేతిలో పరాజయం చవిచూసింది. ఇది వరకే సైనా, శ్రీకాంత్ తొలిరౌండ్లోనే ని్రష్కమించిన సంగతి తెలిసిందే.
కెరీర్‌కు లీ జురుయ్ గుడ్‌బై
ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా ముద్రపడిన చైనీస్ బ్యాడ్మింటన్ దిగ్గజం లీ జురుయ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. లండన్ ఒలింపిక్స్ చాంపియన్ అయిన ఆమె గాయం తర్వాత పూర్తిస్థాయిలో కోలుకోలేదు. 2012లో ఆమె ఒలింపిక్స్‌తో పాటు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచింది. 2013, 2014లలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అక్కడ గాయపడిన ఆమె ఆ తర్వాత కెరీర్‌నే ఇలా ముగించాల్సి వచ్చింది. తన అంతర్జాతీయ కెరీర్‌లో లీ జురుయ్ 14 సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచింది. 2013లో బీడబ్ల్యూఎఫ్ మహిళా ప్లేయర్ అవార్డును గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment