
ఐపీఎల్‌లో ఢిల్లీ రాత మారుస్తా
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-7లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని జట్టు కోచ్, మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో భారత జట్టుకు కోచ్‌గా పని చేసిన అనుభవం ఇందుకు ఉపకరిస్తుందని ఆయన అన్నారు. నగరంలో మంగళవారం జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘మెరుగైన ప్రదర్శన ఇవ్వాలంటే ఇప్పుడు జట్టు తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఆటగాళ్లు తమ అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలి.
జట్టు ఓడినంత మాత్రాన బాధపడకుండా ఇంకా నేర్చుకునేందుకు అవకాశం ఉందని గుర్తించాలి. డేర్‌డెవిల్స్‌కు మంచి భవిష్యత్తు ఉందని నా నమ్మకం’ అని కిర్‌స్టెన్ అభిప్రాయ పడ్డారు. ఢిల్లీకి సంబంధించి ఆటగాళ్ల ఎంపిక మొదలు చాలా అంశాలను చక్కబెట్టాల్సి ఉందని, టీమిండియాకు కోచ్‌గా పని చేసిన అనుభవం పనికొస్తుందని గ్యారీ చెప్పారు. అయితే ఐసీసీ తాజా పరిణామాలు, భారత జట్టు ప్రదర్శనతో పాటు సెహ్వాగ్, గంభీర్‌ల పునరాగమనానికి సంబంధించి అంశాలపై మాట్లాడేందుకు కిర్‌స్టెన్ నిరాకరించారు.