మరో సిరీస్ లక్ష్యంగా...
నేడు జింబాబ్వేతో భారత్ చివరి టి20
డీడీ నేషనల్‌లో సాయంత్రం 4.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం
తొలి టి20 ఓటమి నుంచి తొందరగానే కోలుకుని దెబ్బతిన్న పులిలా రెండో టి20లో చెలరేగిన భారత్ జట్టు...
మరో సిరీస్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది.
జింబాబ్వేపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ధోనిసేన విజయంతో పర్యటనను ముగించాలని భావిస్తోంది.
హరారే: అంతర్జాతీయ వేదికపై తమ సత్తాను నిరూపించుకోవడానికి భారత యువ క్రికెటర్లకు ఆఖరి అవకాశం. ధోని సారథ్యంలో జింబాబ్వేలో పర్యటిస్తున్న భారత యువ జట్టు విజయంతో సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది. నేడు జింబాబ్వేతో జరిగే ఆఖరి టి20లో విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది. అటు జింబాబ్వే కూడా రెండో టి20లో చిత్తుగా ఓడినా... తొలి మ్యాచ్‌లో గెలిచిన స్ఫూర్తితో మరోసారి పోరాడేందుకు సిద్ధమయింది.
అంతా ఫామ్‌లో...: భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ప్రత్యర్థికంటే పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌ను రాహుల్, మన్‌దీప్ సునాయాసంగా ముగించారు. రాయుడు, పాండే, ధోని, జాదవ్ రాణిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. రెండో టి20లో చెలరేగిన భారత పేసర్లు బరీందర్, బుమ్రా, ధావల్‌లు మరో సారి కీలకం కానున్నారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కోవడం జింబాబ్వేకు ఇబ్బందిగా మారింది. గెలిచిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ పర్యటనలో జయంత్ యాదవ్ ఒక్కడికే మ్యాచ్ దక్కలేదు. కానీ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్‌లో ధోని ప్రయోగం చేయకపోవచ్చు.
బ్యాట్స్‌మెన్ రాణిస్తేనే..: జింబాబ్వే ఆశలన్నీ వారి బ్యాట్స్‌మెన్‌పైనే ఉన్నాయి. చిబాబా, మసకద్జా, సికందర్ రజా, చిగుంబురా, వాలర్ తమ బ్యాట్లకు పని పెడితే భారత్‌కు చిక్కులు తప్పవు. అయితే నిలకడలేమితో రెండో టి20లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తగిన మూల్యం చెల్లించుకుంది. తొలి మ్యాచ్ తరహాలో పోరాడితే మాత్రం చరిత్ర సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. ఫామ్‌లోలేని ఆల్‌రౌండర్ ముతుంబోజి స్థానంలో మరుమా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.