మన పరుగులు డక్ వాళ్ల పరుగులు వర్త్
రెండో వన్డేలో భారత్ ఓటమి
కోహ్లి, ధోని శ్రమ వృథా
నంబర్‌వన్ ర్యాంక్ గల్లంతు
న్యూజిలాండ్: 42 ఓవర్లలో 271/7
భారత్: 41.3 ఓవర్లలో 277/9
ఫలితం: 15 పరుగులతో భారత్ ఓటమి
స్కోరు బోర్డులో పరుగులు చూసిన ఎవరైనా భారత్ ఓడిపోయిందంటే నమ్ముతారా..? కానీ అదే నిజం. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు కివీస్‌కన్నా ఎక్కువ పరుగులు చేసినా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఓడిపోయింది. దీనివల్ల రెండు నష్టాలు... ఒకటి సిరీస్‌లో ఇక మిగిలిన మూడు వన్డేలూ చావోరేవో తేల్చుకోవాల్సి రావడం. రెండు... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ హోదా పోగొట్టుకోవడం.
హామిల్టన్: బౌలర్లు కష్టపడినా... బ్యాట్స్‌మెన్ చెమటోడ్చినా... విజయానికి కాస్త అదృష్టం కూడా కావాలి. లేకపోతే ఎవరికైనా రెండో వన్డేలో భారత్ పరిస్థితే ఎదురవుతుంది. వాస్తవానికి దూరంగా ఉండే లక్ష్యాలతో... ఎప్పుడూ విమర్శల్లో ఉండే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ధోనిసేన కొంపముంచింది.
విరాట్ కోహ్లి (65 బంతుల్లో 78; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటానికి తోడు ధోని (44 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్సర్) సమయోచితంగా బ్యాటింగ్ చేసినా.. రెండో వన్డేలో భారత్‌కు ఓటమి తప్పలేదు. సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 15 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) తేడాతో ధోనిసేనపై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది.
విలియమ్సన్ (87 బంతుల్లో 77; 5 ఫోర్లు, 1 సిక్సర్), టేలర్ (56 బంతుల్లో 57; 7 ఫోర్లు), గుప్టిల్ (65 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించగా, అండర్సన్ (17 బంతుల్లో 44; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 41.3 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది. రహానే (42 బంతుల్లో 36; 4 ఫోర్లు), రైనా (22 బంతుల్లో 35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. విలియమ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే ఆక్లాండ్‌లో శనివారం జరుగుతుంది.
అండర్సన్ హవా
కివీస్ ఓపెనర్లలో రైడర్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) వేగంగా, గుప్టిల్ మాత్రం నెమ్మదిగా ఆడాడు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో విలియమ్సన్, గుప్టిల్ రెండో వికెట్‌కు 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచాడు. మిడిలార్డర్‌లో టేలర్ కూడా ఆకట్టుకున్నాడు. అయితే 34వ ఓవర్‌లో రెండోసారి వర్షం రావడంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. వర్షం ఆగిన తర్వాత విలియమ్సన్, టేలర్ వేగంగా ఆడుతూ మూడో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
చివర్లో వచ్చిన అండర్సన్ భారత బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీకి తరలించిన అతను భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇషాంత్, అశ్విన్ బౌలింగ్‌లో చెరో రెండు సిక్సర్లు, షమీ బౌలింగ్‌లో ఒక సిక్సర్‌తో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. టేలర్‌తో కలిసి 28 బంతుల్లోనే 74 పరుగులు జోడించాడు. అయితే మ్యాచ్ చివర్లో నాలుగు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి కివీస్‌ను ధోనిసేన కాస్త కట్టడి చేసింది. షమీ 3 వికెట్లు తీశాడు.
కోహ్లి మెరుపు ఇన్నింగ్స్
ఓపెనర్లు ధావన్ (22 బంతుల్లో 12; 2 ఫోర్లు), రోహిత్ (34 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్సర్) విఫలం కావడంతో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత కోహ్లిపై పడింది. నాలుగో స్థానంలో వచ్చిన రహానే నిలకడను కనబర్చడంతో మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. తర్వాత కోహ్లి, ధోని మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఓవర్‌కు ఓ ఫోర్ చొప్పున కొట్టిన ఢిల్లీ ప్లేయర్ 23వ ఓవర్‌లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అండర్సన్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్‌తో చెలరేగిన ఈ ఢిల్లీ ప్లేయర్ చివరకు సౌతీ బౌలింగ్‌లో మరో షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. రైనా ఫర్వాలేదనిపించినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ధోని చెలరేగి ఆడి అర్ధసెంచరీ చేసినా... అండర్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అదే ఓవర్లో జడేజాను కూడా పెవిలియన్‌కు పంపి అండర్సన్ మ్యాచ్‌ను ఆతిథ్య జట్టు చేతుల్లోకి తెచ్చాడు.
టర్నింగ్ పాయింట్
భారత్ గెలవాలంటే 18 బంతుల్లో 40 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న ధోని, జడేజా భారీ షాట్లతో మంచి ఊపుమీదున్నారు. వీరిద్దరే జట్టుకు విజయాన్ని అందిస్తారనుకున్న దశలో అండర్సన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 40వ ఓవర్ తొలి బంతికి ధోనిని, నాలుగో బంతికి జడేజాను పెవిలియన్‌కు పంపాడు. దీంతో భారత్ విజయ లక్ష్యం 12 బంతుల్లో 37 పరుగులుగా మారింది. ఈ లక్ష్యం ఛేదించడం టెయిలెండర్ల వల్ల కాలేదు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్టిల్ (సి) షమీ (బి) రైనా 44; రైడర్ (సి) ధోని (బి) షమీ 20; విలియమ్సన్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 77; టేలర్ (సి) ధోని (బి) షమీ 57; అండర్సన్ (సి) ధావన్ (బి) ఇషాంత్ 44; బి.మెకల్లమ్ (సి) అండ్ (బి) షమీ 0; రోంచీ నాటౌట్ 18; ఎన్.మెకల్లమ్ (బి) భువనేశ్వర్ 1; మిల్స్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (42 ఓవర్లలో 7 వికెట్లకు) 271.
వికెట్ల పతనం: 1-25; 2-114; 3-174; 4-248; 5-250; 6-251; 7-252
బౌలింగ్: భువనేశ్వర్ 7-1-43-1; షమీ 7-0-55-3; ఇషాంత్ 6-0-46-1; జడేజా 8-0-46-1; కోహ్లి 2-0-12-0; అశ్విన్ 8-0-50-0; రైనా 4-0-18-1
భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) సౌతీ 12; రోహిత్ (సి) రోంచీ (బి) సౌతీ 20; కోహ్లి (సి) (సబ్) డివిచ్ (బి) సౌతీ 78; రహానే (సి) రోంచీ (బి) మెక్లీనగన్ 36; ధోని (సి) విలియమ్సన్ (బి) అండర్సన్ 56; రైనా (సి) సౌతీ (బి) మిల్స్ 35; జడేజా (బి) అండర్సన్ 12; అశ్విన్ (సి) గుప్టిల్ (బి) సౌతీ 5; భువనేశ్వర్ (బి) ఎన్.మెకల్లమ్ (బి) అండర్సన్ 11; షమీ నాటౌట్ 1; ఇషాంత్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (41.3 ఓవర్లలో 9 వికెట్లకు) 277.
వికెట్ల పతనం: 1-22; 2-37; 3-127; 4-164; 5-226; 6-257; 7-259; 8-265; 9-275
బౌలింగ్: మిల్స్ 9-1-50-1; మెక్లీనగన్ 8-1-45-1; సౌతీ 9-0-72-4; ఎన్.మెకల్లమ్ 8-0-40-0; అండర్సన్ 7.3-0-67-3.
డక్‌వర్త్ ‘ముంచిందిలా’!
మ్యాచ్‌కు మధ్యలో అంతరాయం ఏర్పడితే... రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. రెండో వన్డేలో తొలుత న్యూజిలాండ్ 33.2 ఓవర్లు ఆడి 170/2 స్కోరు చేశాక వర్షం పడింది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్ లూయిస్ ఫార్ములా ప్రకారం న్యూజిలాండ్ గనక 50 ఓవర్ల మ్యాచ్ ఆడితే... 42 ఓవర్లలో 296 పరుగులు చేసేది. కివీస్ వాస్తవంగా చేసిన పరుగులు 271 కంటే ఇవి 25 ఎక్కువ. అందుబాటులో ఉన్న వనరులు (వికెట్లు, ఓవర్లు) ఆధారంగా దీనిని లెక్కిస్తారు. దీంతో భారత్‌కు 42 ఓవర్లలో 297 పరుగుల లక్ష్యం ఎదురయింది. భారత్ ఇన్నింగ్స్‌లో మరో మూడు బంతులు ఉండగా మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి జట్టు స్కోరు 277/9. డక్‌వర్త్ పద్దతి ప్రకారం భారత్ 41.3 ఓవర్ల దగ్గర మ్యాచ్ ఆగితే 9 వికెట్లు కోల్పోయిన దశలో 293 పరుగులు చేసి ఉండాలి. కానీ చేయలేదు. దీంతో 15 పరుగులతో భారత్ ఓడినట్లు ప్రకటించారు.
(రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే... మ్యాచ్ ఏ ఓవర్లో ఆగితే ఎన్ని పరుగుల దగ్గర విజయం దక్కుతుందనే షీట్‌ను కెప్టెన్‌కు ఇస్తారు. కాబట్టి ఈ ఓటమికి పూర్తిగా డక్‌వర్త్‌నే తప్పు పట్టలేం. కానీ ఈ విధానం వల్ల పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ ఈ మ్యాచ్)
‘ మిగతా మ్యాచ్‌లు చాలా కీలకం. మరింత మెరుగ్గా ఆడాలి. ఓపెనర్లు పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు బౌలర్లపై ప్రభావం చూపిస్తున్నాయి. అయితే గత ఆరు నెలలతో పోలిస్తే డెత్ ఓవర్లలో మా బౌలింగ్ మెరుగుపడింది. వర్షం అంతరాయం కలిగించడం మాకు ఇబ్బంది కలిగించింది’
- ధోని
(భారత కెప్టెన్)