
మిథాలీసేనకు మరో సవాల్
ఇంగ్లండ్ పర్యటనలో మరో అగ్ని పరీక్షకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది.
భారత్, ఇంగ్లండ్ మహిళల తొలి వన్డే నేడు
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో మరో అగ్ని పరీక్షకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా నేటి నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఏకైక టెస్టు విజయంతో ఆత్మవిశ్వాసాన్ని సాధించిన మిథాలీ సేన పటిష్టమైన ఇంగ్లండ్‌తో మరోసారి తాడోపేడో తేల్చుకోనుంది. బౌలర్లు జోరుమీదున్నప్పటికీ.. స్మృతి మందన, మిథాలీ మినహా మిగిలిన బ్యాట్స్‌వుమెన్ ఫామ్‌లో లేకపోవడం భారత జట్టును ఆందోళన పరుస్తోంది. అయితే ఇటీవల ఏకైక టెస్టులో సాధించిన సంచలన విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ సిరీస్‌లో 21, 23, 25 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.
తొలిసారిగా...
ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్న 2017 మహిళల వన్డే ప్రపంచకప్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల్ని మార్చింది. మహిళల క్రికెట్ కమిటీ గత ఏడాది చేసిన ప్రతిపాదనల ఆధారంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈ రెండున్నరేళ్లలో ప్రతీ జట్టు మిగిలిన ఏడు జట్లతో స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ ఒక్కో వన్డే సిరీస్ ఆడుతుంది.
మొత్తంగా ఒక్కో జట్టుకు కనీసం 21 వన్డేలు ఆడే అవకాశం కలుగుతుంది. గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు దక్కుతాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు ప్రపంచకప్ క్వాలిఫయర్ ద్వారా అర్హత సాధించే చివరి అవకాశం ఉంటుంది.