కావాలనే భారత్ - పాక్ జట్ల మధ్య మ్యాచ్!
టీమిండియా, పాకిస్థాన్.. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆటగాళ్లలోనే కాదు.. అభిమానుల్లో కూడా ఎక్కడ లేని ఉద్వేగం మొదలవుతుంది. అందులోనూ పెద్దపెద్ద టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే స్టేడియాల్లో ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు. అందుకే.. కావాలనే ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉండేలా డ్రాలను కొద్దిగా అటూ ఇటూ చేస్తున్నట్లు సాక్షాత్తు ఐసీసీ చెప్పింది. 2017లో ఇంగ్లండ్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో భారత, పాక్ జట్ల మధ్యనే తొలి మ్యాచ్ జరగనుంది. సుమారు ఏడాది తర్వాత.. జూన్ 4వ తేదీన ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ మ్యాచ్ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండేలా చూడాలనే తాము ప్రయత్నిస్తామని, అందులో అనుమానం అక్కర్లేదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారని, అలాంటి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమైతే మంచి కిక్ వస్తుందని ఆయన అన్నారు. ఒక టోర్నమెంటు గ్రూప్ దశలోనే భారత్, పాక్ జట్లు తలపడటం వరుసగా ఇది ఐదోసారి. ఈ రెండు జ్టల మధ్య మ్యాచ్‌లను టీవీలలో దాదాపు వందకోట్ల మంది చూస్తారని అంచనా. కావాలనే డ్రా ఇలా వేయడం వల్ల టోర్నమెంటు సమగ్రతను కోల్పోతుందన్న వ్యాఖ్యలను రిచర్డ్‌సన్ ఖండించారు. గ్రూపుల్లో ఉన్న దేశాల ర్యాంకులను కలిపి చూస్తే.. రెండు గ్రూపుల పాయింట్లు సమానంగా ఉన్నాయన్నారు. రెండింటి మధ్య సరితూకం ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పారు.