భారత్ ‘డబుల్’ ధమాకా
- ప్రపంచ టీమ్ బిలియర్డ్స్‌లో స్వర్ణ, రజతాలు
- టైటిల్స్‌లో పంకజ్ అద్వానీ రికార్డు
గ్లాస్గో: అంతర్జాతీయ బిలియర్డ్స్‌లో భారత్ మరోసారి సత్తా చాటింది. గ్లాస్గోలో జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఓ స్వర్ణం, రజత పతకంతో మెరుపులు మెరిపించింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’ జట్టు 5-4తో భారత్ ‘ఎ’ జట్టును ఓడించింది. తాజా విజయంతో పంకజ్ అద్వానీ (10) అత్యధిక ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతవరకు ఏ క్రీడలో ఏ ఆటగాడూ ఇన్ని ప్రపంచ టైటిల్స్‌ను గెలవలేదు. భారత్ ‘ఎ’ తరఫున అలోక్ కుమార్, భాస్కర్, సౌరవ్ కొఠారీ, ధ్రువ్ సిత్వాలా; భారత్ ‘బి’ తరఫున పంకజ్ అద్వానీ, రూపేశ్ షా, దేవేంద్ర జోషి, అశోక్ శాండిల్యాలు ప్రాతినిధ్యం వహించారు.
గంటపాటు జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మూడు రౌండ్లలో భారత్ ‘ఎ’ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి మూడు రౌండ్లలో ‘బి’ జట్టు 2-1తో నెగ్గి స్కోరును సమం చేసింది. చివరి మూడు రౌండ్లలో భారత్ ‘బి’ ఆటగాళ్లు పంకజ్ 613-116తో కొఠారీని; రూపేశ్ షా 379-90తో అలోక్‌ను ఓడించి జట్టుకు టైటిల్‌ను అందించారు. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత ప్రపంచ టీమ్ ఈవెంట్‌ను నిర్వహించాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ సమాఖ్య వచ్చే కామన్వెల్త్ గేమ్స్‌లో క్యూ స్పోర్ట్స్‌ను ప్రవేశపెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.