టీమిండియా విజయోత్సాహం
హామిల్టన్: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టి20లో ‘సూపర్’ విజయం సాధించిన టీమిండియా కొత్త రికార్డు సృష్టించింది. టి20 చరిత్రలో ‘సూపర్’ రికార్డును తిరగరాసింది. సూపర్ ఓవర్‌లో ఛేజింగ్ చేస్తూ వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సరికొత్త రికార్డు లిఖించింది. ఇంతకుముందు వెస్టిండీస్ పేరిట రికార్డును బద్దలు కొట్టింది. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ సూపర్ ఓవర్ ఛేజింగ్‌లో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు సాధించింది.
బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా సూపర్ ఓవర్‌లో ముందుగా కివీస్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ‘హిట్‌మాన్’ రోహిత్ శర్మ చివరి రెండు బంతులకు వరుస సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. కాగా, ఇప్పటివరకు టి20ల్లో ఆరుసార్లు, వన్డేల్లో ఒకసారి కలిపి న్యూజిలాండ్ జట్టు మొత్తం ఏడుసార్లు సూపర్ ఓవర్ ఆడింది. అయితే ఆరుసార్లు న్యూజిలాండ్ జట్టుకు పరాజయమే ఎదురుకావడం గమనార్హం. (చదవండి: ఊహించని ప్రదర్శన.. అద్భుత విజయం)
‘సూపర్’ విశేషాలు..
►న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌతీ ఐదుసార్లు సూపర్ ఓవర్ వేయగా, నాలుగుసార్లు ఓడిపోవడం గమనార్హం.
►ఐపీఎల్, అంతర్జాతీయ టి20ల్లో కలిపి జస్‌ప్రీత్ బుమ్రా మూడుసార్లు సూపర్ ఓవర్ వేయగా... మూడుసార్లూ అతని జట్టునే విజయం వరించింది. ఐపీఎల్‌లో 2017లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో... 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బుమ్రా సూపర్ ఓవర్ వేశాడు.
Comments
Please login to add a commentAdd a comment