వాళ్లు ప్రాక్టీస్‌లో... మనోళ్లు హోటల్‌లో...
►వాన కారణంగా భారత్ సెషన్ రద్దు
►ఇండోర్ నెట్స్‌లో ఆస్ట్రేలియా సాధన
►రేపటి రెండో వన్డేపై సందేహాలు!
కోల్‌కతా: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్‌కు వాన ముప్పు వీడేలా కనిపించడం లేదు. స్థానిక వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం నగరంలో మరో 48 గంటల పాటు వర్ష సూచన ఉంది. గత రెండు రోజులుగా ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. మంగళవారం కూడా వర్షం పడటంతో భారత జట్టు ప్రాక్టీస్‌కు దూరమైంది. ఆటగాళ్లంతా హోటల్ రూమ్‌లకే పరిమితమయ్యారు. ‘వాన కారణంగా ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు. జట్టు ఆటగాళ్లు స్టేడియానికి వెళ్లటం లేదు’ అని భారత టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఈడెన్ మైదానానికి వచ్చి ఇండోర్ సౌకర్యాలను ఉపయోగించుకుంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఇండోర్ నెట్స్‌లో చాలా సమయం పాటు ప్రాక్టీస్ చేయగా, బౌలర్లు మాత్రం వెనక్కి వెళ్లిపోయారు. అయితే తమ వద్ద అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, కొద్దిసేపు ఎండ కాసినా మ్యాచ్ కోసం గ్రౌండ్‌ను సిద్ధం చేయగలమని ఈస్ట్‌జోన్ క్యురేటర్ ఆశిష్ భౌమిక్ విశ్వాసం వ్యక్తం చేశారు.
స్మిత్‌కు కఠిన సవాల్: క్లార్క్
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం నాయకుడిగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడని మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఏదో ఒకటి చేసి ఆసీస్‌ను అతను గెలుపు బాట పట్టించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ‘చాలా కాలంగా స్మిత్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం సవాళ్లు ఎదురవుతున్నాయి. జట్టును గెలిపించేందుకు అతను పరిష్కారం కనుగొనాలి. రెండో వన్డే సిరీస్ గమనాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి ఆస్ట్రేలియా కోలుకునేందుకు ఇదే సరైన తరుణం’ అని క్లార్క్ విశ్లేషించాడు. మరో వైపు 2019 ప్రపంచకప్‌లోనే కాకుండా 2023లో కూడా ఆడగల సామర్థ్యం ధోనికి ఉందంటూ క్లార్క్ సరదాగా వ్యాఖ్యానించాడు.